మనీ కోసం జానకి పాట

10 Sep, 2017 04:48 IST|Sakshi
మనీ కోసం జానకి పాట

తమిళసినిమా: డబ్బెవరికి చేదు పిచ్చోడా! అన్నది పాట మాత్రమే కాదు. ప్రస్తుతం అదే ప్రపంచంగా మారిందన్నది ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.కాగా గాయని ఎస్‌.జానకి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గానకోకిల అంటే ఎస్‌.జానకినే. ఆమె ఆలపించిన గానామృతాలెన్నో. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో తన మధురమైన గానంతో సంగీత ప్రియులను మైమరపించిన జానకి ఇటీవల పాడడం తగ్గించుకున్నారు.

తమిళంలో చివరిగా జీవా నటించిన తిరునాళ్‌ చిత్రంలో పాడారు. 80 వసంతంలోకి అడుగిడిన ఎస్‌.జానకి ఇకపై పాడరాదని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత చాలా మంది దర్శక నిర్మాతలు అడిగినా పాడలేదు. అలాంటిది ఇటీవల మనీ కోసం ఒక పాట పాడేశారు. అయితే నిజంగా డబ్బు కోసం ఈ గాన సరస్వతి పాడలేదు. మనీ అనే తమిళ చిత్రం కోసం పాడారు. ఆర్‌ఆర్‌.సినీ ప్రొడక్షన్‌ పతాకంపై రాజు, రఫిక్‌ నిర్మించిన ఈ చిత్రానికి ఆర్‌డీ.రాగన్‌ దురైరాజన్‌ కథ, దర్శకత్వం, సంగీతం బాధ్యతలను నిర్వహించారు.

ఈయన ఇంతకు ముందు పలు దేశ విదేశాల్లో అనేక సంగీత విభావరిలు నిర్వహించారు. వాటిలో కొన్నింటిలో ఎస్‌.జానకి పాలు పంచుకున్నారట. ఆ సన్నిహితంతో మనీ చిత్రంలో ఆరో ఆరారో అనే మంచి పాటను అద్భుతంగా పాడారట. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన  చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శకుడు వెల్లడించారు. మనీ చిత్ర ఆడియోను జాగ్వుర్‌తంగం అతిథిగా పాల్గొ ని ఆవిష్కరించా రు. ఇందులో నటుడు నితిన్‌సత్య, నాజర్, మనోబాల, యోగిబాబు, సింగముత్తు ప్రధాన పాత్రలు పోషించారు.