సల్మాన్ ఖాన్‌ సంపాదన ఏటా రూ.220 కోట్లు.. ఆదాయ వనరులు ఇవే..

20 Nov, 2023 12:47 IST|Sakshi

సల్మాన్ ఖాన్‌ నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా, తన సంపదను వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిపెట్టి కోట్లు ఆర్జిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చే డబ్బును విభిన్న మార్గాల్లో మదుపు చేసి ఏటా దాదాపు రూ.220 కోట్లు సంపాదిస్తున్నట్లు జీక్యూ ఇండియా సర్వే తెలిపింది. సల్మాన్ ఖాన్‌ కలిగి ఉన్న తొమ్మిది ఆదాయ మార్గాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

1. బాక్సాఫీస్: అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి అనేక ఇతర బాలీవుడ్ నటుల మాదిరిగానే సినిమా ప్రారంభించడానికి ముందే సల్మాన్‌ఖాన్‌ రెమ్మునరేషన్‌ తీసుకుంటారు. కొన్ని సినిమాలకు ప్రాఫిట్‌-షేరింగ్‌ ఒప్పందాల ప్రకారం వాటికి వచ్చే ఆదాయంలో దాదాపు 50శాతం వాటాను తనకు ఇవ్వాల్సి ఉంటుంది. 

2. ప్రొడక్షన్ హౌస్: 2011లో సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్‌ అనే ప్రొడక్షన్‌ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. దాని ఆధ్వర్యంలో చిల్లర్ పార్టీ జాతీయ అవార్డు చిత్రంతోపాటు బజరంగీ భాయిజాన్ వంటి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఇతర సినిమాలు సైతం ఈ బ్యానర్‌ ఆధ్వర్యంలో రూపొందిస్తున్నారు.

3. స్టార్టప్‌లలో పెట్టుబడి: యాత్రా.కామ్‌ అనే ట్రావెల్‌ కంపెనీలో సల్మాన్‌ఖాన్‌కు దాదాపు 5శాతం వాటా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థల నివేదిక ప్రకారం తెలిసింది. ఆన్‌మొబైల్ గ్లోబల్ లిమిటెడ్ కంపెనీ నేతృత్వంలోని చిన్న వీడియో ప్లాట్‌ఫారమ్ అయిన ‘చింగారి’లో ఆయన పెట్టుబడి పెట్టారు. ఈ స్టార్టప్‌లో బ్రాండ్ అంబాసిడర్‌గా చేరారు.

4. క్లాతింగ్‌ కంపెనీ: 2012లో స్థాపించిన బీయింగ్ హ్యూమన్ క్లాతింగ్‌ కంపెనీ ద్వారా సల్మాన్ ఖాన్ ఫౌండేషన్‌ సేవలందిస్తోంది. దీని ద్వారా పేదలకు ఆరోగ్య సంరక్షణ, విద్యను అందిస్తున్నారు. ఈ కంపెనీ యూరప్, మిడిల్‌ఈస్ట్‌ దేశాల్లోనూ దాని కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ దేశంలో 90 కంటే ఎక్కువ స్టోర్లను కలిగి ఉంది.

5. ఫిట్‌నెస్ పరికరాలు, జిమ్‌: సినీ పరిశ్రమలోని ఫిట్‌నెస్ నటుల్లో ఒకరిగా ప్రశంసలు అందుకున్న సల్మాన్ ఖాన్ 2019లో బీయింగ్ స్ట్రాంగ్‌ కంపెనీను ప్రారంభించారు. ఫిట్‌నెస్ పట్ల తనకున్న అభిరుచిని లాభదాయకమైన వ్యాపార సంస్థగా మార్చుకున్నారు. ముంబై , నోయిడా, ఇందోర్, కోల్‌కతా, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో జిమ్‌లను ప్రారంభించారు. 

6. రియల్ ఎస్టేట్: సల్మాన్ ఖాన్ ముంబయిలో ఇళ్లు, వాణిజ్య స్థలాలను కొనుగోలు చేశారు. ముంబయి శాంటాక్రూజ్‌లోని తన నాలుగు అంతస్తుల భవనాన్ని అద్దెకు ఇచ్చి నెలకు దాదాపు రూ.1 కోటి సంపాదిస్తున్నట్లు అంచనా. 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని ఖాన్‌ 2012లో రూ.120 కోట్లకు కొనుగోలు చేశారు. గతంలో ఈ స్థలాన్ని ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఫుడ్‌హాల్‌కు నెలకు రూ.90లక్షల చొప్పున అద్దెకు ఇచ్చారు.

ఇదీ చదవండి: వందల ఉద్యోగులను తొలగించిన అమెజాన్‌ అలెక్సా

7. టీవీ షోలు: 2010-11 సీజన్ నుంచి ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. అందుకోసం వారానికి రూ.12 కోట్లు వసూలు చేస్తున్నారని కొన్ని మీడియా కథనాల్లో ప్రచురించారు. బిగ్‌ బాస్ సీజన్ 17 ముగిసే సమయానికి దాదాపు రూ.200 కోట్లను సంపాదించవచ్చని అంచనా. బిగ్ బాస్ కంటే ముందు ఆయన 10కా దమ్ అనే రియాలిటీ గేమ్ షోకు వ్యాఖ్యాతగా పనిచేశారు. 

8. బ్రాండ్ యాడ్‌లు: హీరో హోండా, బ్రిటానియా టైగర్ బిస్కెట్, రియల్‌మీ, రిలాక్సో, డిక్సీ స్కాట్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు  సల్మాన్ ఖాన్ ప్రచారకర్తగా ఉన్నారు. ఇందుకోసం ఒక్కో కంపెనీ ద్వారా ఏటా దాదాపు రూ.6 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేస్తారని అంచనా.

9. ఎన్‌ఎఫ్‌టీ: 2021లో సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్, రజనీకాంత్, సన్నీ లియోన్‌తోపాటు ఇతర నటులు నాన్-ఫంగిబుల్ టోకెన్‌లలో పెట్టుబడి పెట్టారు. దానివల్ల వారి అభిమానులు నటుడికి సంబంధించిన ప్రత్యేకమైన ఆర్ట్‌లు, మ్యూజిక్‌, వీడియోలు, ఫొటోలు వంటివి డిజిటల్‌ రూపంలో కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: క్రికెట్‌ మ్యాచ్‌తో డబ్బు సంపాదన! ఎలాగంటే..

పైన తెలిపిన అన్ని మార్గాల ద్వారా సల్మాన్ ఖాన్ వార్షిక ఆదాయం రూ.220 కోట్లుగా తేలింది. అంటే నెలకు దాదాపు రూ.16 కోట్లు. దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన ఖాన్‌ ఆస్తుల నికర విలువ సుమారు 350 యూఎస్‌ మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2,907 కోట్లు)గా ఉన్నట్లు కొన్ని కథనాలు వల్ల తెలుస్తుంది.

మరిన్ని వార్తలు