నీకిది అవసరమా?

9 Apr, 2019 11:29 IST|Sakshi

సినిమా: అనవసరమైన చోట మౌనమెంతో మేలు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. ప్రశంసలకైనా సమయం, సందర్భం పాటించాలని కూడా అంటుంటారు. ఇవేవీ ఆలోచించకపోతే ఇదిగో నటి కాజల్‌అగర్వాల్‌ మాదిరి ఇరుకున పడాల్సివస్తుంది. అసలేం జరిగిందంటే నటి కాజల్‌ అగర్వాల్‌ మంచి నటి. ఇటీవల మరీ అదృష్టం బాగుంది. నటిగా దశాబ్దంన్నర తరువాత నటుడు కమలహాసన్‌తో నటించే అవకాశం వరించింది. అదీ శంకర్‌ వంటి స్టార్‌ దర్శకుడి చిత్రంలో. అయితే ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఇండియన్‌–2 చిత్రం కమలహాసన్‌ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల కాస్త వాయిదా పడటం కాజల్‌ అగర్వాల్‌కు నిరాశపరచే అంశమే అయినా, ఆ చిత్రం డ్రాప్‌ కావడం లేదన్నది ఊరట. ఇక మరో విషయం ఏమిటంటే హీరోయిన్ల లక్కీ హీరోగా ముద్ర పడిన జయంరవితో జత కట్టే అవకాశం ఈ బ్యూటీ బ్యాగ్‌లోకి చేరడం. ఇకపోతే హింది చిత్రం క్వీన్‌ తమిళ రీమేక్‌ ప్యారిస్‌ ప్యారిస్‌లో కాజల్‌ అగర్వాల్‌ నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదల కావలసి ఉంది. అసలు విషయం ఏమిటంటే పీఎం నరేంద్రమోదీ పేరుతో మోదీ బయోపిక్‌ తెరకెక్కింది. మోదీగా నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటించారు.

త్వరలో తెరపైకి రానున్న ఈ చిత్రంపై ఎన్నికల సమయం కావడంతో రాజకీయ రంగు పులుముకుంటోంది. చిత్రానికి సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన బోర్డు సభ్యులపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలా వివాదాంశంగా మారిన పీఎం నరేంద్రమోదీ చిత్ర పోస్టర్‌ను ప్రధాని పాత్రధారి వివేక్‌ ఒబెరాయ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి సంతోషం వ్యక్తం చేశారు. దీనిపై ఏం మాట్లాడితే ఎలాంటి వ్యతిరేకతకు గురవ్వాల్సివస్తుందోనని సినీ ప్రముఖులెవరూ నోరు మెదపడం లేదు. అలాంటిది కాజల్‌ అగర్వాల్‌ మాత్రం తన స్పందనను వ్యక్తం చేసింది. చిత్రం సూపర్‌గా ఉంటుందని నమ్ముతున్నాం. చిత్రాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. శుభాకాంక్షలు వివేక్‌ అని కాజల్‌అగర్వాల్‌ ట్వీట్‌ చేసింది. దీంతో కాజల్‌ అగర్వాల్‌పై నెటిజన్లు విమర్శల దాడికి దిగుతున్నారు. ఇది ఎన్నికల ప్రచార చిత్రం అన్న విషయం తెలుసా? అంటూ ఒకరు, రాజకీయాలపై ఆశ కలుగుతోందా? అంటూ మరోకరు, ఈ చిత్రం ఎలా ఉంటుందీ, ఎందుకోసం రూపొందించారో మీకు తెలుసా? అని మరోకరు, కాజల్‌ అగర్వాల్‌ నటించిన చిత్రాలను తమిళనాడులో నిషేధించేలా స్టాలిన్‌ చర్యలు తీసుకోవాలని ఇంకొకరు కాజల్‌అగర్వాల్‌పై ట్విట్టర్‌లో మూకుమ్మడి దాడి చేస్తున్నారు. తొందరపడి కోయిల ముందే కూసింది అన్న మాదిరిగా ఇప్పుడు  కాజల్‌ పరిస్థితి మారింది. తాను వివేక్‌ ఒబెరాయ్‌ మెప్పు పొందాలని భావిస్తే ఇదేమిటీ ఇలా జరుగుతోంది అని తల పట్టుకుందట.

మరిన్ని వార్తలు