ఈ ట్రాక్ రికార్డున్న యువహీరో అతనొక్కడే

5 Jul, 2014 01:24 IST|Sakshi
ఈ ట్రాక్ రికార్డున్న యువహీరో అతనొక్కడే

‘హీరోగా, నిర్మాతగా దాదాపు పదేళ్ల ప్రయాణం’... తెలుగు చిత్ర సీమలో ఈ ట్రాక్ రికార్డున్న యువహీరో అతనొక్కడే. తనే కల్యాణ్‌రామ్. మహానటుడు ఎన్టీఆర్ మనవడైన కల్యాణ్‌రామ్‌కు నిర్మాతల కొరత లేదు. కానీ... బయట సినిమాలను ఎక్కువగా ప్రిఫర్ చేయరాయన. క్వాలిటీ నెపంతో నిర్మాతలతో అతిగా ఖర్చుపెట్టించడం ఇష్టం లేకపోవడమే అందుకు కారణం. నిర్మాణ బాధ్యతల్ని తలకెత్తుకోవడానికి కారణం కూడా అదే. నచ్చిన పాత్రలు చేస్తారు. నచ్చినట్లు సినిమా తీస్తారు. దటీజ్ కల్యాణ్‌రామ్. ఇప్పటివరకూ ఏడాదికి ఒక్క సినిమా చేస్తూ వచ్చిన ఈ నందమూరి అందగాడు... ఇప్పుడు వేగం పెంచారు.

ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ‘పటాస్’. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై అనిల్ రావిపూడిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారాయన. ఇక రెండో సినిమా ‘షేర్'. చాలా కాలం తర్వాత బయట సంస్థలో కల్యాణ్‌రామ్ నటిస్తున్న సినిమా ఇది. విజయలక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై కొమరం వెంకటేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలావుంటే... నిర్మాతగా మరో అడుగు ముందుకేసి బయట హీరోలతో కూడా చిత్రాలు నిర్మించడానికి సమాయత్తమయ్యారు కల్యాణ్‌రామ్.

అందులో భాగంగానే రవితేజ హీరోగా ‘కిక్’ సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారాయన. దీనితో పాటు తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ రీతిగా కెరీర్‌ని జెట్ స్పీడ్‌తో కొనసాగిస్తున్నారు కల్యాణ్‌రామ్. నేడు ఆయన పుట్టిన రోజు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే ఈ యువహీరో... విరివిగా విజయాలందుకోవాలని ఆకాంక్షిద్దాం.