అప్రజాస్వామిక పద్ధతులకు తెరతీసిన టీడీపీ | Sakshi
Sakshi News home page

అప్రజాస్వామిక పద్ధతులకు తెరతీసిన టీడీపీ

Published Sat, Jul 5 2014 1:19 AM

అప్రజాస్వామిక పద్ధతులకు తెరతీసిన టీడీపీ - Sakshi

  • అప్రజాస్వామిక పద్ధతులకు తెరతీసిన టీడీపీ
  •  డబ్బు వెదజల్లి.. మభ్యపెట్టి.. ఎంపీపీలు కైవసం
  •  ఆగిరిపల్లి ఎన్నిక నేటికి వాయిదా
  •  టీడీపీకి 36, వైఎస్సార్‌సీపీకి 11, బీజేపీ 1 మండలపరిషత్‌లు
  • తెలుగుదేశం పార్టీ తన నీచ రాజకీయాలను మరోసారి బయటపెట్టింది. మండలపరిషత్‌లలో తనకు బలం లేని స్థానాల్లోనూ డబ్బు వెదజల్లి వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులను తమకు అనుకూలంగా మార్చుకుంది. పెడన, మొవ్వ, పెదపారుపూడి, అవనిగడ్డ, బాపులపాడు తదితర మండలాలను అప్రజాస్వామిక పద్ధతుల్లో దక్కించుకుంది.
     
    మచిలీపట్నం : మండల పరిషత్ పాలకవర్గాల ఎంపికలో తెలుగుదేశం పార్టీ బరితెగించింది. డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుపెట్టింది. అప్రజాస్వామిక పద్ధతుల్లో ఎంపీపీ పదవులను కైవసం చేసుకునేందుకు కుయుక్తులు పన్నింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 11, టీడీపీ 36, బీజేపీ 1 ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోగా, ఆగిరిపల్లి మండల పరిషత్ ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థులుగా గెలిచినవారిని రాత్రికి రాత్రే పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నాయకులు తెగబడ్డారు.

    ఆగిరిపల్లి మండలంలో టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను ఆ పార్టీ నాయకులే అజ్ఞాతంలో ఉంచి ఏమీ తెలియనట్లు ధర్నాకు దిగారు. అధికార బలం ఉపయోగించుకుని ఈ మండలంలో ఎంపీపీ ఎన్నికను శనివారం నాటికి వాయిదా వేయించుకున్నారు. యాదృ  చ్ఛికమే అయినా పెడన, వీరులపాడు మండలాల్లో లాటరీ పద్ధతిన టీడీపీ ఎంపీపీలు ఎన్నికయ్యారు.

    బాపులపాడు మండల పరిషత్ ఎన్నికలలో 24 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ, టీడీపీ చెరిసగం సీట్లు గెలుచుకోగా, గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్ మంత్రాంగం నడిపి వైఎస్సార్‌సీపీకి చెందిన వీరవల్లి, కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యులు అనారోగ్యం కారణంగా ఓటింగ్‌లో పాల్గొనరని దగ్గరుండి మరీ పత్రం ఇప్పించి, వారిని వెంటబెట్టుకుని తీసుకెళ్లిపోవటం చర్చనీయాంశమైంది. దీంతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుల సంఖ్య 10కి తగ్గిపోగా, 12 మంది సభ్యులతో ఉన్న టీడీపీ మండలపరిషత్‌ను దక్కించుకుంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న కైకలూరు మండల పరిషత్‌ను బీజేపీ దక్కించుకుంది.
     
    ఆగిరిపల్లి మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్సార్ సీపీ, టీడీపీకి చెరో తొమ్మిది స్థానాలు వచ్చాయి. టీడీపీకి చెందిన చొప్పరమెట్ల ఎంపీటీసీ సభ్యుడు  పుసునూరు శ్రీనివాసరావు మూడు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆగిరిపల్లి-1 ఎంపీటీసీ సభ్యురాలు ముల్లంగి విజితను టీడీపీ నాయకులే దాచిపెట్టి, తమ పార్టీకి చెందిన సభ్యులను వైఎస్సార్ సీపీ సభ్యులు కిడ్నాప్ చేశారంటూ ఆ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ధర్నా నిర్వహించారు. టీడీపీ నాయకులు హడావుడి చేయటంతో శనివారం నాటికి ఈ ఎన్నికను వాయిదా వేశారు.
     
    పెడన మండలంలో పది ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్సార్‌సీపీకి 6, టీడీపీకి 4 స్థానాలు వచ్చాయి. మండలంలోని నందిగామ వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యురాలు జన్ను భూలక్ష్మికి ఎంపీపీ పదవి ఆశ చూపి టీడీపీ నాయకులు ఆమెను తమవైపు తిప్పుకొన్నారు. దీంతో ఎన్నిక సమయంలో రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. లాటరీ పద్ధతిలో టీడీపీ ఎంపీపీ పదవిని దక్కించుకుంది. దీంతో జన్ను భూలక్ష్మి ఎంపీపీగా ఎన్నికయ్యారు.
     
    మొవ్వ మండలంలో మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్సార్ సీపీ 8, టీడీపీ 6 స్థానాల్లో గెలుపొందగా, మరో స్థానం స్వతంత్ర అభ్యర్థికి దక్కింది. కోసూరు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీగా గెలుపొందిన కిలారపు మంగమ్మకు ఎంపీపీ పదవి ఇస్తామని టీడీపీ నాయకులు ఆశ చూపారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి, వైఎస్సార్ సీపీ అభ్యర్థితో కలుపుకొని టీడీపీకి ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. దీంతో కిలారపు మంగమ్మ ఎంపీపీగా గెలుపొందారు.
     
    పెదపారుపూడి మండలంలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్సార్ సీపీకి 6, టీడీపీకి 3 స్థానాలు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందిన వెంట్రప్రగడ-1 ఎంపీటీసీ గొరిపర్తి శ్రీలక్ష్మి, వానపాముల ఎంపీటీసీ  వీరపనేని కుమారి, దోసపాడు ఎంపీటీసీ కె.రాజేశ్వరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. దీంతో టీడీపీ ఎంపీపీ పదవిని కైవసం చేసుకుంది.
     
    అవనిగడ్డ మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్సార్ సీపీ 4, టీడీపీ 6, స్వతంత్రులు 2 స్థానాల్లో గెలుపొందారు. ముగ్గురు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులను టీడీపీలో చేర్చుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ వ్యూహం పన్నటంతో ఈ ముగ్గురు సభ్యులు టీడీపీకి మద్దతు తెలిపారు. దీంతో ఈ మండల పరిషత్‌ను టీడీపీ దక్కించుకుంది.
     
    వీరులపాడులో 14 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్సార్ సీపీ 8, టీడీపీ 3, సీపీఐ 2, స్వతంత్ర ఒక స్థానంలో గెలుపొందగా, టీడీపీ, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి ఏకమయ్యారు. దీంతో వారి స్థానాలు ఆరుకు చేరాయి. వైఎస్సార్‌సీపీ నుంచి పొన్నవరం ఎంపీటీసీ సభ్యురాలు సుంకర వరలక్ష్మి టీడీపీలో చేరటంతో చెరో ఏడు స్థానాలతో సంఖ్య సమానమైంది. లాటరీ పద్ధతిలో ఎన్నిక నిర్వహించగా ఈ ఎంపీపీ స్థానాన్ని టీడీపీ దక్కించుకుంది.
     

Advertisement
Advertisement