నిర్మాత వేణుగోపాల్‌ మృతి

10 Nov, 2023 04:31 IST|Sakshi
వేణుగోపాల్‌

‘నక్షత్రం’(2017) సినిమా నిర్మాతల్లో ఒకరైన ఎస్‌వీఎస్‌ వేణుగోపాల్‌(60) బుధవారం రాత్రి మృతిచెందారు. కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్‌ వెళుతున్న రైలు నుంచి ఆయన ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. సీరియల్స్‌ నిర్మాతగా ఆయన బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులే. ‘ఆనందో బ్రహ్మ’ (1996) సీరియల్‌తో నిర్మాతగా ఆయన ప్రస్థానం మొదలైంది. దాదాపు పది సీరియల్స్‌ నిర్మించారాయన.

‘ప్రియురాలు పిలిచె’ ఆయన తీసిన చివరి సీరియల్‌. ‘తులసీదళం’ సీరియల్‌కి నంది అవార్డు అందుకున్నారు వేణుగోపాల్‌. సినిమా నిర్మాతగా ‘నక్షత్రం’ ఆయన తొలి చిత్రం.. అదే చివరి చిత్రం కూడా. హీరో చిరంజీవి నటించిన తొలి టీవీ షో ‘విజయం వైపు పయణం’ కి వేణుగోపాల్‌ నిర్మాత. ఈ షోకి యండమూరి వీరేంద్రనాథ్‌ దర్శకత్వం వహించారు. వేణుగోపాల్‌కి భార్య, ఇద్దరు కుమారులున్నారు. వేణుగోపాల్‌ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నేడు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

కాగా ‘నక్షత్రం’ సినిమా నిర్మాతల్లో ఒకరైన సజ్జు మాట్లాడుతూ ‘‘వేణుగోపాల్‌గారు రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్నది అవాస్తవం. ఆయనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు’’ అన్నారు.

మరిన్ని వార్తలు