నాన్న అంటే ఓ ఫీలింగ్‌

4 Jan, 2019 04:06 IST|Sakshi
కల్యాణ్‌ రామ్‌

‘‘నాన్నగారి పాత్ర కోసం లుక్‌ టెస్ట్‌ జరిగినప్పుడు నేనంత కాన్ఫిడెంట్‌గా లేను. క్రిష్‌ మాత్రం ‘బావుంది, నన్ను నమ్మండి’ అన్నారు. ఎవరికైనా పంపి ఫీడ్‌బ్యాక్‌ తీసుకుందామా? నెగటివ్‌గా చెబితే? అని కూడా అనిపించింది. ఆ తర్వాత బాబాయ్‌ (బాలకృష్ణ) కాల్‌ చేశారు. ‘సూపర్‌గా ఉన్నావు. ఇరవయ్యో ఏట మా అన్నయ్య ఎలా ఉన్నాడో అలాగే ఉన్నావు’ అన్నారు. ‘హెయిర్‌ స్టయిల్‌ ఎలా ఉంటుందో అనుకున్నా. సూపర్‌గా సెట్‌ అయింది అన్నా’ అని తారక్‌ అనడంతో కాన్ఫిడెన్స్‌ వచ్చేసింది’’ అన్నారు కల్యాణ్‌ రామ్‌. యన్‌.టి. రామారావు జీవితం ఆధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’. క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగం ‘యన్‌.టి.ఆర్‌ : కథానాయకుడు’ ఈ నెల 9న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలో తండ్రి హరికృష్ణ పాత్రను పోషించిన కల్యాణ్‌ రామ్‌ పలు విశేషాలు పంచుకున్నారు.

► ఎన్టీఆర్‌ బయోపిక్‌లో పార్ట్‌ అవ్వడం గొప్ప విషయం అనుకుంటాను. తెలుగు సినిమాలకు పోస్టర్‌బాయ్‌ తాతగారు. తెలుగు సినిమాలు కూడా అద్భుతమైన కలెక్షన్స్‌ సాధిస్తాయని నిరూపించాయి ఆయన సినిమాలు. రాజకీయాల గురించి తెలిసిందే.

► నాన్నగారి పాత్ర పోషించాలనేసరికి కాస్త భయమేసింది. ఫిజికల్‌ అప్పియరెన్స్‌ పరంగా ఆయనలా మనం ఉండమే? అప్పటికీ ఈ లుక్‌ కోసం దాదాపు పది కిలోలు పెరిగా. అయినా సరిపోవడం లేదు. నోట్లో దూది పింజలు పెట్టుకొని యాక్ట్‌ చేశా. విగ్‌ పెడితే బాగుండదని నా జుట్టుకే కొంచెం ఎక్స్‌టెన్షన్‌ పెట్టాం. దానికోసం గంటా గంటన్నర మేకప్‌కే పట్టేది.

► మా నాన్నగారు భౌతికంగానే మాకు దూరం అయ్యారు. ఎమోషనల్‌గా ఎప్పుడూ మాతోనే ఉంటారు. నాన్నగారు ఓ ఫీలింగ్‌. ఆ ఫీలింగ్‌ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఆ సమయంలో మా ఫ్యామిలీ అంతా మాతో నిలబడ్డారు. అది ఆయన మీద అందరికీ ఉన్న ప్రేమ, గౌరవం. ఇప్పటికీ ఏదో రోజు వస్తూనే ఉన్నారు. మీరు ఒంటరిగా లేరు, మేమున్నాం అనే ధైర్యాన్ని ఇస్తున్నారు.

► ఈ పాత్ర సులువుగా చేయడానికి కారణం బాబాయ్‌. నాన్నతో కలసి పెరిగారు ఆయన. ‘మీ నాన్న ఎవరికీ భయపడరు, ముక్కుసూటి మనిషి. మీ తాతగారంటే మీ నాన్నగారికి విపరీతమైన ప్రేమ, గౌరవం.. భయం కాదు’ అని బాబాయ్‌ అన్నారు. ఇలా నాన్నగారికి సంబంధించిన ప్రతీది చెప్పి, చేసి చూపించారు బాబాయ్‌.

► నాన్నగారు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు తలను గోక్కుంటూ ఉండేవారట. అది నాకు తెలియదు. నాకు తెలియకుండానే నాన్నగారిని నేను అనుకరించేవాడినంట. నాన్నగారు ఉన్నప్పుడే నేను బయోపిక్‌లో యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలుసు. ‘వెరీ గుడ్‌ ఆల్‌ ది బెస్ట్‌’ అన్నారు. ఆయన రియాక్షన్స్‌ చాలా సింపుల్‌గా ఉంటాయి. మరో వారం రోజుల్లో కథ వినాలి. కానీ ఇంతలోనే జరగరానిది జరిగింది. నాన్నగారు, నేనూ ఓ సినిమాలో యాక్ట్‌ చేయాల్సింది. ఆ కథ ఇంకా మా దగ్గరే ఉంది. చూడాలి ఏమౌవుతుందో.

► తాతగారిని సెలబ్రేట్‌ చేయడమే బయోపిక్‌ ఉద్దేశం. మా తాతగారు, నానమ్మ తారకమ్మగారి జీవితాలే ఈ సినిమా. క్రిష్‌ కాకపోతే ఇంకెవరూ ఈ సినిమా చేయలేరని నా అభిప్రాయం. డాక్యుమెంటరీలా అయిపోకుండా కొన్ని చోట్ల లిబర్టీ తీసుకున్నాం.

► ఈ సినిమాను బాబాయ్‌ ఓ బాధ్యతగా తీశారు. అలాగే ఈ సినిమా మీద వస్తున్న పొలిటికల్‌ ఇష్యూస్‌ నేను పట్టించుకోను. ప్రస్తుతం ‘118’ చేస్తున్నాను. మరో సినిమా సిద్ధంగా ఉంది.  మొత్తం ఫైనల్‌ అయ్యాక అనౌన్స్‌ చేస్తాను.

మరిన్ని వార్తలు