61వ వసంతంలోకి ప్రయోగాల ఆధ్యుడు

7 Nov, 2015 09:31 IST|Sakshi

సిల్వర్ స్క్రీన్‌పై ప్రయోగాలకు ఆధ్యుడు కమలహాసన్ అంటే అతిశయోక్తి కాదేమో. అసలు కమల్ అంటేనే వండర్ అని చెప్పవచ్చు. ఈయన ఒక నటపిపాచి అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఐదో ఏటనే నటనలో బుడిబుడి అడుగులు వేసిన కమలహాసన్ తొలి చిత్రం కలత్తూర్ కన్నమ్మ చిత్రానికిగానూ అప్పటి రాష్ట్రపతి చేతుల మీదగా బంగారు పతకాన్ని అందుకున్నారు.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనడానికి ఈ బాల నట మేధావి విషయంలో ఇంతకంటే మంచి ఉదాహరణ ఇంకేముంటుంది. 1954లో తమిళనాడు పరమకుడిలో జన్మించిన కమలహాసన్ విశ్వనటుడవుతారని బహుశ ఆయనే ఊహించి ఉండరు. నటన, నాట్యం, నృత్య దర్శకత్వం, దర్శకత్వం, కథకుడు, గాయకుడు, పాటల రచయిత, స్క్రీన్‌ప్లే రచయిత ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్‌లో గొప్ప ఫిలాసఫర్ ఉన్నారు. మొత్తం మీద సినీ ఎన్‌సైక్లోపీడియాగా పేరెన్నికగన్న కమలహాసన్ శనివారం 61వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.

సినిమాల్లో నిత్యకృషీవలుడు, నిరంతర శ్రామికుడు, ప్రయోగాలకు ఆధ్యుడు, ప్రపంచ సినిమాను అవపోసన పట్టిన విశ్వనటుడు కమల్ నట విధూషణకు నిదర్శనాలు ఎన్నో. కమల్ నటించిన అపూర్వరాగంగళ్ చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్నారు. అలా నాలుగు జాతీయ అవార్డులు, 19 ఫిలింఫేర్ అవార్డులకు కమల్ అలంకారమయ్యారు. 1979లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి పురస్కారం, 1990లో కేంద్రప్రభుత్వం నుంచి పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ అవార్డులు కమల్‌ను వరించాయి. సాధారణంగా పాత్రకు తగ్గట్లుగా నటులు తమను మలచుకుంటారు. అలాంటిది క్లాస్, మాస్ ఏ తరహా కథాచిత్రం అయినా ఈ నట దిగ్గజానికి మౌల్డ్ అవ్వాల్సిందే. అంతగా తన మార్కు ఉంటుంది.
 
    ఒక మరోచరిత్ర, ఒక నాయకుడు, ఒక 16 వయదినిలే, ఒక దేవర్‌మగన్, ఒక మైఖెల్ మదనకామరాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ నట తృష్ణకు తార్కాణాలు ఎన్నో ఎన్నెన్నో. ఒకే చిత్రంలో పది పాత్రలు పోషించి మెప్పించిన ఏకైక నటుడు కమలహాసనే అని ప్రతి తమిళుడూ గర్వంగా చెప్పుకునే చరిత్ర దశావతారం చిత్రం. ఇక ప్రయోగాల విషయానికి వస్తే అపూర్వసహోదర్‌గళ్ చిత్రంలో కమలహాసన్ నటించిన అప్పు అనే మరుగుజ్జు పాత్ర ఇప్పటికీ చాలా మందికి అబ్బురపరచే అంశమే. హాలీవుడ్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ సినిమాకు పరిచయం చేయడంలో ఆధ్యుడు కమలహాసనే.

డిజిటల్ సినిమాను తన ముంబయి ఎక్స్‌ప్రెస్ చిత్రం ద్వారా భారతీయ సినిమాకు స్వాగతం పలికింది ఈ సినీ విజ్ఞానే. అలాగే డీటీఎస్ సౌండ్, ఆరా 3డీ సౌండ్స్ పరిజ్ఞానానికి తమిళంలో శ్రీకారం చుట్టింది ఈ ప్రయోగాల వీరుడే. ఆరా 3డీ సౌండ్ పరిజ్ఞానాన్ని కమల్ తన విశ్వరూపం చిత్రం ద్వారా భారతీయ సినిమాకు దిగుమతి చేశారు. కొత్తదనం కోసం తపించే కమల్ విశ్వరూపం, ఉత్తమవిలన్, తాజా చిత్రం తూంగావనం చిత్రాల సౌండ్ రికార్డింగ్, విఎఫ్‌ఎక్స్ వంటి సాంకేతికపరమైన అంశాలను అమెరికాలో రూపొందించడం గమనార్హం.

 చెన్నై, హైదరాబాద్‌లలో  సౌండ్ రికార్డింగ్ స్టూడియోస్..
 ప్రేక్షకులకు వినూత్న అనుభూతి కలిగించడానికి ప్రయత్నించే కమలహాసన్ అమెరికాలో సౌండ్ రికార్డింగ్ వంటి పనులు భారం అవుతున్న నేపథ్యంలో తానే అంతటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సౌండ్ రికార్డింగ్ స్టూడియోలను ఇతరులకు అందుబాటులో ఉండే విధంగా చెన్నై, హైదరాబాద్‌లో సొంతంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 సేవా కార్యక్రమాల్లోనూ ముందే..
 కమలహాసన్ చేసే గుప్త దానాలెన్నో. వ్యక్తిగతంగా నాస్తికుడయిన కమల్‌లో మానవత్వం మెండు. ఈ చేత్తో చేసిన సాయం ఆ చేయికి కూడా తెలియవన్నంతగా ఆయన సేవలు ఉంటాయి. అభిమాన సంఘం పేరుతో అనేక సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు. తన పుట్టిన రోజు సందర్భంగా ప్రతియేటా వికలాంగులను, నిరుపేదలను, విద్యార్థులను ఆర్థికంగా, ఉపాధి పరంగా ఆదుకుంటున్న మానవతావాది కమలహాసన్. ఆయన మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిద్దాం.    
-  తమిళసినిమా