కమల్‌ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి

24 Sep, 2017 08:37 IST|Sakshi

తమిళ సినిమా: కమలహాసన్‌ రాజకీయరంగప్రవేశంపై తీసుకున్న నిర్ణయానికి చివరి వరకూ కట్టుబడి ఉండాలని సీనియర్‌ హాస్యనటుడు వివేక్‌ అన్నారు.  తమిళనాడులో మరో వంద రోజుల్లో ఎన్నికలు జరిగినా పోటీ చేయడానికి నేను రెడీ అంటూ నటుడు కమలహాసన్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారి తీశాయి. ఇప్పటివరకూ పరోక్షంగా తన రాజకీయ రంగప్రవేశం గురించి చెబుతూ వచ్చిన ఆయన ఇప్పుడు ప్రత్యక్షంగా తన నిర్ణయాన్ని వెల్లడించడాన్ని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్వాగతిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హాస్యనటుడు వివేక్‌ శనివారం తన ట్విట్టర్‌ పేజీలో రాజకీయరంగ ప్రవేశ నిర్ణయాన్ని తీసుకున్న  కమలహాసన్‌ను అభినందిస్తున్నానన్నారు. ఆయన చివరి వరకూ ఆ నిర్ణయానికి కట్టుబడాలని నిజాయితీపరుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. వచ్చేది ఎవరైనా, ఆహ్వానించడం సంప్రదాయం అయినా, ఆదరించేది ప్రజలేనని వివేక్‌ పేర్కొన్నారు.

పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపైనే
మరో నటుడు ఎస్‌వీ.శేఖర్‌ అన్నాడీఎంకే నేతలపై విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మైలాడుదురైలోని కావేరి పుష్కర స్నానం చేసి ఆడి కంచి శంకరస్వామిజీలను దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఎస్‌వీ.శేఖర్‌ విలేకరులతో మాట్లాడుతూ కావేరి మహాపుష్కర స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల నమ్మకం అన్నారు. అందుకే ఇక్కడ నిత్యం 50 వేల మంది పుణ్యస్నానాలు చేస్తున్నారన్నారు. అయితే కావేరి నీరు రాకపోవడంతో కలుషిత నీటిలోనే పుణ్య స్నానాలాచరిస్తున్న దుస్థితి నెలకొందన్నారు. ఇక్కడ కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అన్నాడీఎంకే నేతలు తమ ప్రభుత్వాన్ని ,పార్టీ గుర్తును కాపాడుకోవడం పైనే దృష్టి సారిస్తున్నారని, ప్రజల గురించి పట్టించుకోవడం మానేశారని ఆరోపించారు.

రజనీ,కమల్‌ ఎవరైనా..
రజనీకాంత్, కమలహాసన్, విజయ్‌ ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని, అయితే వారు ప్రజలకు ఏం చేస్తారో స్పష్టం చేయాలన్నారు. 

మరిన్ని వార్తలు