కార్గిల్‌ ఒక వీరుడి పోరాటం

24 Aug, 2017 01:08 IST|Sakshi
కార్గిల్‌ ఒక వీరుడి పోరాటం

తమిళసినిమా: వినూత్న ప్రయత్నాలకెప్పుడూ ప్రేక్షకుల మధ్య విశేష ఆదరణ ఉంటుంది. నిజానికి ఏదో కొత్తదనం లేకపోతే సినిమా చూసే వారికి రుచించదు. అందుకే ఒకే ఒక్క పాత్రతో శివానీసెంథిల్‌ కార్గిల్‌ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈయన కథ, కథనం, మాటలు సమకూర్చి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శివానీ స్టూడియోస్‌ పతాకంపై శుభాసెంథిల్‌ నిర్మించారు. ఇందులోని ఒకే ఒక్క పాత్రను జీష్ణుమీనన్‌ పోషించారు. గణేశ్‌ పరమహంస ఛాయాగ్రహణ, విఘ్నేశ్‌బాయ్‌ సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ బుధవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఆర్‌కేవీ స్టూడియోలో జరిగింది.

అంతకు ముందే ప్రముఖ నిర్మాత కలైపులి కార్గిల్‌ ఆడియోను ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ కార్గిల్‌ కథలోనూ ఒకే రాజా ఉంటాడన్నారు. అతను చెన్నై నుంచి కారులో బెంగుళూర్‌ వెళుతున్న సమయంలో తన ప్రేయసీతో వివాదం కార్గిల్‌ పోరుగా మారడంతో అందులో రాజా పోరాడి గెలవడమే చిత్ర కథ అన్నారు. తమిళ సినిమాలో ఒకే ఒక్క నటుడు నటించిన వినూత్న కథా చిత్రం కార్గిల్‌ అని చెప్పారు. చిత్రం ఆధ్యంతం ఆసక్తిగా ఉంటుందని అన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నైలో ప్రారంభించి బెంగళూర్‌లోని ఎలక్ట్రానిక్స్‌ సిటీలో ముగిసేలా తక్కువ రోజుల్లో పూర్తి చేశామని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కార్గిల్‌ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.