లైకా పేరు తీసి.. రేపే 'కత్తి' విడుదల

21 Oct, 2014 12:50 IST|Sakshi
లైకా పేరు తీసి.. రేపే 'కత్తి' విడుదల

కత్తి సినిమా విడుదలకు రంగం సిద్ధమైపోయింది. ఈ సినిమా విషయంలో నెలకొన్న వివాదంపై హీరో విజయ్ ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. తమిళ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చిత్ర నిర్మాణ సంస్థ అయిన 'లైకా' పేరును సినిమా నుంచి తొలగిస్తున్నట్లు అందులో విజయ్ చెప్పారు. షెడ్యూలు ప్రకారమే.. అంటే బుధవారమే తమిళనాడులో సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ సినిమా విషయంలో నెలకొన్న అభ్యంతరాలన్నీ తొలగినట్లు అయ్యింది.

అంతకుముందు కత్తి చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పడంతో సోమవారం రాత్రి చెన్నైలో పలు థియేటర్లపై తమిళ సంఘాల వాళ్లు రాళ్లు రువ్వారు. ఆ దాడిలో రెండు థియేటర్లు ధ్వంసమయ్యాయి. థియేటర్ల వద్ద భారీగా పోలీసులను మెహరించారు.

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కత్తి చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే ఈ నిర్మాణ సంస్థతో శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సకు సంబంధాలున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే మహింద రాజపక్సపై తమిళనాడు ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ చిత్రం బ్యానర్ నుంచి లైకా పేరు తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ డిమాండును అంగీకరించడంతో విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి