తెలుగువారికీ చూపించాలనిపించింది

16 Aug, 2019 00:29 IST|Sakshi
భీమనేని, కేయస్‌ రామారావు, హనుమాన్‌

– కేయస్‌ రామారావు

‘‘తమిళ చిత్రం ‘కణ’ చూసి ఆశ్చర్యపోయా. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చూపించాలనుకున్నాం. అందుకే ‘కౌసల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్‌’గా రీమేక్‌ చేసి, తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం’’ అని నిర్మాత కేయస్‌ రామారావు అన్నారు. ఐశ్వర్యా రాజేష్, రాజేంద్ర ప్రసాద్, కార్తీక్‌ రాజు, ‘వెన్నెల’ కిశోర్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి’. భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో కేయస్‌ రామారావు సమర్పణలో కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేయస్‌ రామారావు మాట్లాడుతూ– ‘‘సినిమా ఫస్ట్‌ కాపీ ఎప్పుడో సిద్ధమైంది. కానీ ఎక్కువమంది ఆడియన్స్‌కు రీచ్‌ కావాలని ఈ నెల 23న విడుదల చేస్తున్నాం. మన తెలుగు అమ్మాయి ఐశ్వర్యా రాజేష్‌ నటించిన క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రం ఇది. తమిళంలో ఐదు పెద్ద సినిమాల మధ్య విడుదలై కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఇలాంటి ఒక మంచి కథకు భీమనేని శ్రీనివాసరావుగారైతే న్యాయం చేయగలరని దర్శకునిగా తీసుకున్నాం. ఆయన బాగా తీశారు.

హనుమాన్‌ చౌదరి చాలా మంచి డైలాగ్స్‌ రాశారు. ఈ నెల 18న ప్రీ–రిలీజ్‌ వేడుక జరుపబోతున్నాం’’ అన్నారు. ‘‘ఏ సినిమా చేసినా ఒకే కమిట్‌మెంట్‌తో చేస్తాను. పెద్దా, చిన్నా అనే తేడాలు ఆలోచించకుండా కంటెంట్‌ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదిరిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు భీమనేని. ‘‘నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన కేయస్‌ రామారావుగారికి థ్యాంక్స్‌. భీమనేనిగారితో ‘సుడిగాడు’ సినిమాకు వర్క్‌ చేశాను. అలాగే ‘కేజీఎఫ్‌’ తర్వాత నేను డైలాగ్స్‌ రాసిన చిత్రం ఇది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది’’ అన్నారు మాటల రచయిత హనుమాన్‌ చౌదరి.

మరిన్ని వార్తలు