తండ్రులు చాలా గొప్పవారు

18 Jun, 2019 02:41 IST|Sakshi

– ఆర్‌. నారాయణమూర్తి

‘‘ధర్మేంద్ర, బెల్లంకొండ సురేష్‌ తమ కొడుకుల కోసం చాలా కష్టపడ్డారు. వాళ్లలాగా ఈరోజు గౌతంరాజు కూడా తన కొడుకుని హీరో చెయ్యాలని చేస్తున్న సంకల్పం చాలా గొప్పది. అందుకే తండ్రులు చాలా గొప్పవారు. తండ్రి రుణం తీర్చుకోవాలని కృష్ణని కోరుతున్నాను. ‘కృష్ణారావ్‌ సూపర్‌ మార్కెట్‌’ సినిమా బాగా నచ్చింది. మంచి హిట్‌ అవుతుంది’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్‌. నారాయణమూర్తి అన్నారు. హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌’. శ్రీనాధ్‌ పులకరం దర్శకత్వంలో బిజెఆర్‌ ఫిల్మ్‌ అండ్‌ టీవీ స్టూడియోస్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘నారాయణమూర్తిగారు మంచి నీళ్లలాంటి వారు.

అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. గౌతంరాజు కోసం ఇంత మంది వచ్చారు. చిన్న సినిమాల్లోనే మాకు చాలా ప్రత్యేకమైన పాత్రలు ఉంటాయి. మాకు మంచి గుర్తింపు కూడా వస్తుంది’’ అన్నారు. ‘‘సినిమా ప్రొడ్యూస్‌ చేస్తున్నా అని గౌతంరాజు చెప్పగానే.. ‘ఎందుకు ఇంత రిస్క్‌ చేశావ్‌?’ అన్నాను. నా కొడుకుని హీరోగా పరిచయం చెయ్యాలనుకున్నాను.. అది నా లక్ష్యం అన్నారు’’ అని నటుడు సుమన్‌ అన్నారు. ‘‘సినిమా సెన్సార్‌ పూర్తయింది. ఈ చిత్రం కోసం నాకు చాలా మంది సహాయం చేశారు’’ అన్నారు గౌతంరాజు. ‘‘నా కెరియర్‌కి ఇది మంచి మూవీ అవుతుంది’’ అన్నారు కృష్ణ. ‘‘గౌతంరాజుగారికి కథ బాగా నచ్చి, సినిమా తీశారు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్‌’’ అని శ్రీనాధ్‌ పులకురవ్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు