హీరోకి వచ్చిన కలలన్నీ నాకొచ్చినవే

7 Mar, 2019 02:56 IST|Sakshi
కేవీ గుహన్‌

‘‘దర్శకుడిగా నా ప్రయాణం ఓ కలతో మొదలైంది. ఆ కలతో తీసిన ‘118’ సినిమా విజయం సాధించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేవీ గుహన్‌. కల్యాణ్‌రామ్, నివేథా థామస్, శాలిని పాండే హీరో హీరోయిన్లుగా గుహన్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ మహేశ్‌ కోనేరు నిర్మించిన ‘118’ ఇటీవల విడుదలైంది. మంచి టాక్‌తో విజయవంతంగా సాగుతోందన్నారు గుహన్‌. బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ– ‘‘118’లో హీరోకి వచ్చిన కలలు నాకొచ్చినవే.

నాకు ఒక పెద్ద రూమ్‌లో ఒక్కడినే ఉండాలంటే చాలా భయం. కానీ కెమెరామేన్‌గా అనేక ప్రదేశాలు తిరుగుతుంటాను కాబట్టి తప్పదు. ఓ సినిమా కోసం నేను ఓ హోటల్‌ రూమ్‌లో బస చేశాను. రాత్రి నిద్రపోయిన తర్వాత భయంకరమైన కల వచ్చింది. అది నిజంగా జరిగినట్లే అనిపించింది. మర్నాడు ఒంట్లో ఓపిక లేనట్లు నీరసంగా లొకేషన్‌కి వెళ్లాను. డాన్స్‌మాస్టర్‌ ప్రేమ్‌రక్షిత్‌ ‘ఏంటి సార్‌ నీరసంగా ఉన్నారు’ అనడిగితే, ‘కల వచ్చింది’  అని చెప్పాను. కొన్ని కలలు అలానే ఉంటాయి అనుకున్నాం. ఆ కల గురించి ఆ తర్వాత ఆలోచిస్తూనే ఉన్నాను.

ఓ రెండేళ్ల తర్వాత అదే హోటల్‌లో అదే రూమ్‌లో ఉండాల్సి వచ్చింది. మళ్లీ అదే కలకు కంటిన్యూషన్‌గా కల రావడంతో ఆశ్చర్యపోయాను. ఓసారి అనుకోకుండా కల్యాణ్‌రామ్‌ను కలిసినపుడు ‘ఓ లైన్‌ ఉంది వింటారా’ అని అడిగితే ‘సరే’ అన్నారు. రెండు గంటలపాటు కథను నెరేట్‌ చేశాను. ‘మీరు కెమెరామేన్‌ అయ్యుండి కథని ఇంత బాగా నెరేట్‌ చేశారు, మనం ఈ సినిమా చేస్తున్నాం’ అన్నారాయన. వారం రోజుల్లో సినిమా స్టార్ట్‌ అయ్యింది. అంతా ఓ కలలా జరిగిపోయింది. ప్రస్తుతం మేం ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాం. చాలామంది నిర్మాతలు వేరే భాషలో ఈ సినిమా చేయొచ్చు కదా అంటున్నారు.

నేను ఇదే కథను ఏ భాషలో కావాలన్నా ఎన్నిసార్లు చేయమన్నా ఆనందంగా చేస్తాను. చేసిన సినిమానే కదా, మళ్లీ ఏం చేస్తాంలే అనుకోను. ఒకవేళ హిందీలో కాని, తమిళ్‌లో కాని రీమేక్‌ చేసే అవకాశం వస్తే తెలుగులో నేను చేసిన చిన్న చిన్న తప్పులు కూడా లేకుండా ఇంకా బాగా చేస్తాను. నేను దర్శకత్వం వహించే సినిమాలకు నేనే కెమెరామెన్‌గా పనిచేస్తే దర్శకునిగా నాకేం కావాలో అలా చేసుకోగలుగుతాను. నాలోని డైరెక్టర్‌కి, కెమెరామెన్‌కి క్లాష్‌ ఉండదు. మంచి అవుట్‌పుట్‌ ఇస్తాను. ప్రస్తుతం తమిళ్‌లో కెమెరామెన్‌గా చరణ్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు పనిచేస్తున్నా. తెలుగులో దర్శకుడిగా చేద్దామనుకుంటున్నాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా