పాలిటెక్నిక్‌లో 21,481 మంది విద్యార్థులు డిటెయిన్‌ 

7 Mar, 2019 02:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హాజరు తక్కువ కావడంతో  పరీక్షలకు అనర్హులైన వైనం 

వారందరికీ వచ్చే నెల 15 తర్వాత ప్రత్యేక తరగతులు 

సాక్షి, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యార్థుల్లో 32% మంది డిటెయిన్‌ అయ్యారు. వారికి 75%హాజరు లేకపోవడంతో ఆ విద్యార్థులంతా సెమిస్టర్‌ పరీక్షలు రాయలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా రెండో సెమిస్టర్, నాలుగో సెమిస్టర్‌ విద్యార్థులు 68 వేల మంది ఉంటే అందులో 21,481 మంది విద్యార్థులు డిటెయిన్‌ అయినట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) పేర్కొంది. ఇందుకు బయోమెట్రిక్‌ హాజరు విధానంలో సాంకేతిక సమస్యలే కారణమని కాలేజీల యాజమాన్యాలు చెబుతుండగా, ఆ వాదనను ఎస్‌బీటీఈటీ కొట్టి పారేసింది. అదే నిజమైతే ప్రైవేటు కాలేజీల్లోని 40% మంది విద్యార్థులు డిటెయిన్‌ అయితే, ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు 14% మంది మాత్రమే ఎందుకు డిటెయిన్‌ అవుతారని అధికారులు పేర్కొంటున్నారు. పరీక్షలకు అనర్హులైన వీరికి ప్రత్యామ్నాయంగా మళ్లీ ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి పరీక్షలు జరిపేలా ఉన్న తాధికారురలు కసరత్తు చేస్తున్నారు. 

పదే పదే చెబుతున్నా.. 
ఏటా ప్రభుత్వ కాలేజీల్లో 85% విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతుండగా, ప్రైవేటు కాలేజీల్లో 45% మంది విద్యా ర్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు. దీంతో మొత్తంగా ఉత్తీర్ణత శాతం 65 శాతానికి మించట్లేదు. దీంతో సాంకేతిక విద్యా శాఖ బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానం అమల్లోకి వచ్చాక సమస్యల పరిష్కారానికి జిల్లాకో టెక్నికల్‌ టీం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు తక్కువ హాజరు ఉందన్న విషయాన్ని నెలవారీగా కూడా వెల్లడిస్తున్నామని పేర్కొంటున్నారు. ఇన్నాళ్లూ సాంకేతిక సమస్యల గురించి చెప్పకుండా డిటెయిన్‌ అయ్యాక సమస్యలు ఉన్నాయంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 

ఈ ఒక్కసారికే అవకాశం
డిటెయిన్‌ అయిన విద్యార్థులు అత్యధికంగా ఉన్న నేపథ్యంలో సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, బోర్డు కార్యదర్శి వెంకటేశ్వర్లు సమావేశమై చర్చించారు. ఈ పరిస్థితుల్లో అంత మంది విద్యార్థులు డిటెయిన్‌ అయితే నష్టపోతారని, మొదటిసారి కాబట్టి ఒకసారి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వారికి వచ్చే నెల 15 తర్వాత నుంచి ప్రత్యేకంగా మే నెలాఖరు వరకు నెలన్నర పాటు తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు