ఇండియాలో టైటానిక్ హీరో సీక్రెట్ టూర్

7 Nov, 2015 12:30 IST|Sakshi

ఎప్పుడు షూటింగ్లతో అభిమానులతో బిజీ బిజీగా ఉండే హాలీవుడ్ రొమాంటిక్ అండ్ యాక్షన్ హీరో లియోనార్డో డికాప్రియో భారత్ లో సందడి చేశాడు. వాతావరణ మార్పులపై తెరకెక్కిస్తున్న ఓ డాక్యుమెంటరీ షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చిన డికాప్రియో షూటింగ్ గ్యాప్లో తాజ్ మహాల్ను సందర్శించాడు. అయితే డికాప్రియో ఇండియా పర్యటన వివరాలను చాలా గోప్యంగా ఉంచారు. శనివారం ఉదయం లియోనార్డో తాజ్ను సందర్శించినట్టుగా చెపుతున్నారు. తాజ్ పరిసరాల్లో ఈ హాలీవుడ్ స్టార్ తీసుకున్న సెల్పీ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

లియోనార్డో శనివారం ఉదయం 7గంటల 15 నిమిషాల సమయంలో క్యాప్, బ్లాక్ గాగుల్స్తో తాజ్ సందర్శనకు వచ్చాడు. అయితే ముందుగా సమాచారం లేకపోవటం, సెక్యురిటీ పరంగా కూడా ఎలాంటి హడావిడి లేకపోవటంతో చాలా సమయం వరకు అభిమానులను ఆయన్ను గుర్తించలేదు. చాలాసేపటికి  లియోనార్డోను గుర్తించిన ఓ అభిమాని ఫోటో తీసే ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న ఆయన సెక్యురిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాజ్ పరిసరాల్లో ఉల్లాసంగా గడిపిన లియోనార్డో డికాప్రియో తరువాత షూటింగ్ నిమిత్తం ఢిల్లీ వెళ్లిపోయాడు.