1912 Titanic Dinner Menu Viral: ‘టైటానిక్‌’ ఆఖరి డిన్నర్‌ మెనూ వేలం.. ఎంత పలికిందో తెలుసా?

12 Nov, 2023 19:29 IST|Sakshi

Titanic Dinner Menu: టైటానిక్‌ ఓడ గురించి దాదాపుగా అందరికీ తెలుసు. సుమారు 110 ఏళ్ల క్రితం మంచుకొండను ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయిందీ భారీ ఓడ. ఈ ప్రమాదంలో వందలాది మంది  చనిపోయారు. ఈ ఓడ ప్రమాద ఉదంతం గురించి పాతికేళ్ల క్రితమే హాలీవుడ్‌లో ఓ సినిమా సైతం వచ్చింది. అది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తెలిసిందే. 

ఆఖరి విందు
టైటానిక్‌ ఆఖరి ఫస్ట్-క్లాస్ డిన్నర్ మెనూను ఇంగ్లండ్‌లో శనివారం (నవంబర్‌11) వేలం వేయగా  83,000 పౌండ్లు (రూ. 84.5 లక్షలు) పలికినట్లు యూకేకి చెందిన వార్తాపత్రిక ‘ది గార్డియన్’ పేర్కొంది.

టైటానిక్‌ ఓడలో ఫస్ట్-క్లాస్ ప్రయాణికుల కోసం తయారు చేసిన ఆఖరి విందు ఇది. ఈ ఓడ తన తొలి అట్లాంటిక్ సముద్రయానంలో 1912 ఏప్రిల్‌ 14న మంచుకొండను ఢీకొట్టి మునిగిపోవడానికి కేవలం మూడు రోజుల ముందు నాటిది.

ఈ చారిత్రక మెనూ ఐర్లాండ్‌లోని క్వీన్స్‌టౌన్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన టైటానిక్ మరుసటి రోజు ప్రయాణికులకు అందించిన వంటకాల గురించి తెలియజేస్తోంది. విల్ట్‌షైర్‌కు చెందిన హెన్రీ ఆల్డ్రిడ్జ్ & సన్ అనే సంస్థ ఈ మెనూను వేలం వేసింది.

రకరకాల వంటకాలు
వేలానికి వచ్చిన టైటానిక్‌ ఆఖరి ఫస్ట్-క్లాస్ డిన్నర్ మెనూలో వివిధ దేశాలకు చెందిన రకరకాల వంటకాలు ఉన్నాయి. ఆప్రికాట్లు, ఫ్రెంచ్ ఐస్‌క్రీమ్ వంటి డెసర్ట్‌లతోపాటు ఆయిస్టర్లు, సాల్మన్, బీఫ్, స్క్వాబ్, బాతు, చికెన్‌ వంటి నాన్‌వెజ్‌ రుచులతో పాటు నోరూరించే వెజిటేరియన్‌ వంటరాలు ఇందులో ఉన్నాయి. ఈ మెనూ నీటిలో తడిసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు