మా భూమి @ 40

23 Mar, 2020 00:10 IST|Sakshi
‘మాభూమి’ చిత్రంలో ఓ దృశ్యం

ఇండస్ట్రీ కొన్నిసార్లు మూస దారిలో ప్రయాణిస్తుంటుంది... అదే రహదారని భ్రమపడేంత.  కొన్నిసార్లు ఆ దారిని ఏమాత్రం లెక్క చేయకుండా..  కొత్త దారుల్ని వెతుక్కుంటూ కొన్ని సినిమాలు వెళ్తాయి. ‘పాత్‌ బ్రేకింగ్‌’ సినిమాలంటాం వాటిని. 40 ఏళ్ల క్రితం చేసిన అలాంటి ప్రయత్నమే ‘మా భూమి’. ఫలితం – ప్రభంజనం.  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో వచ్చిన సినిమా ‘మా భూమి’. తెలుగు సినిమాల్లో సంచలనాలను ప్రస్తావించాల్సినప్పుడల్లా ‘మా భూమి’ని నెమరువేసుకుంటూనే ఉన్నాం. ఇవాళ మళ్లీ గుర్తు చేసుకుందాం. నేటితో ‘మా భూమి’ 40ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి వంద విశేషాలు ఉంటాయి. కానీ 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమైన 40 విశేషాలు మీకోసం.

► కిషన్‌ చందర్‌ రాసిన ‘జబ్‌  ఖేత్‌ జాగే’ అనే ఉర్దూ నవల ఈ సినిమాకు స్ఫూర్తి.
► ప్రఖ్యాత బెంగాలీ దర్శకుడు మృణాల్‌ సేన్‌ సలహా మేరకు గౌతమ్‌ – ఘోష్‌ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు.
► దర్శకుడు గౌతమ్‌ ఘోష్‌కి ఇదే తొలి సినిమా.
► నవల ఆధారంగా గౌతమ్‌ ఘోష్‌ ఓ కథను రాసుకొచ్చారు. కానీ నిర్మాతలకు అంతగా నచ్చలేదు. మళ్లీ తెలంగాణాలో పలు ప్రాంతాలు సందర్శిస్తూ ఈ కథను రాసుకున్నారు.  
► ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్‌ కుమారుడు త్రిపురనేని సాయిచంద్‌ ఈ సినిమా ద్వారానే పరిచయమయ్యారు.
► ఈ సినిమాను నిర్మించడమే కాకుండా స్క్రీన్‌ప్లేను అందించారు బి. నర్సింగరావు.
► ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాలలో ఈ సినిమాకు నంది అవార్డులు వరించాయి.
► కార్వే వారీ ప్రపంచ చలన చిత్రోత్సవాల్లో మన దేశం తరఫున అధికారికంగా ఎంపికయిన చిత్రం ‘మా భూమి’.
► సీఎన్‌ఎన్‌– ఐబీఎన్‌ తయారు చేసిన ‘వంద అత్యుత్తమ భారతీయ చిత్రాల’ జాబితాలో ‘మా భూమి’ చోటు చేసుకుంది.
► ఈ సినిమా చిత్రీకరణ చాలా భాగాన్ని మెదక్‌ జిల్లాలోని మంగళ్‌పర్తిలో చేశారు. అది బి. నరసింగరావుగారి అత్తగారి ఊరే.
► లక్షన్నర బడ్జెట్‌ అనుకుని మొదలయిన ఈ చిత్రం పూర్తయ్యేసరికి ఐదున్నర లక్షలయింది.
► ఈ సినిమాకు గౌతమ్‌ ఘోష్‌ భార్య నిలాంజనా ఘోష్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరించారు.
► ఈ సినిమాకు సంబంధించిన బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ను దర్శకుడు గౌతమే స్వయంగా చూసుకున్నారు.
► పాపులర్‌ నటి తెలంగాణ శకుంతల ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
► కేవలం ఉదయం ఆటగానే ప్రదర్శించేట్టు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. విడుదల తర్వాత హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో ఏడాది పాటు నిర్విరామంగా ఆడింది.
► ప్రజాగాయకుడు గద్దర్‌ తొలిసారి స్క్రీన్‌ మీద కనిపించిన చిత్రం ఇదే.
► తెలంగాణ పల్లె జీవితం ఎలా ఉండాలో అర్థం చేసుకోవడానికి గౌతమ్, నర్సింగరావు తెల్లవారగానే పల్లెలోకి వెళ్లి ఊరిలోని ప్రజలు ఎలా జీవిస్తున్నారో గమనిస్తూ ఉండేవారట.
► సినిమా షూటింగ్‌ ప్రారంభించడానికి ఇల్లును కుదవపెట్టారట నర్సింగరావు.
► సినిమాలో ఒక సన్నివేశంలో శవం దగ్గర ఏడ్చే సన్నివేశం ఉంది. కానీ ఆ సీన్‌లో యాక్ట్‌ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదట. సుమారు మూడు నాలుగు ఊర్లు గాలించి పోచమ్మ అనే ఆవిడను తీసుకువచ్చి నటింపజేశారట.
► ఈ సినిమాలోని ‘బండెనక బండి కట్టి... పదహారు బళ్లు కట్టి..’ పాట చాలా పాపులర్‌. మొదట ఈ పాటను నర్సింగరావు మీద తీశారు. రషెష్‌ చూసుకున్న తర్వాత నా కంటే గద్దర్‌ మీద చిత్రీకరిస్తే బావుంటుంది అని సూచించారు నర్సింగరావు.
► మా భూమి చిత్రాన్ని మార్చి 23నే విడుదల చేయాలని దర్శక–నిర్మాతల ఆలోచన. భగత్‌ సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను ఉరి తీసింది మార్చి 23వ తేదీనే. ఆ రోజు విడుదల చేస్తే ఆ ముగ్గురికీ నివాళిలా ఉంటుందని భావించారట.
► సినిమా పూర్తయి సెన్సార్‌కి నిర్మాతల జేబులు ఖాళీ అయిపోతే సహ నిర్మాత రవీంద్రనాథ్‌ పెళ్లి ఉంగరాలను తాకట్టుపెట్టి వచ్చిన రూ.700లతో సెన్సార్‌ జరిపించారు.
► సహజత్వానికి దగ్గరగా ఉండాలని సాయి చంద్‌ పాత్రకు ఊర్లోని వారి బట్టలను అడిగి తీసుకుని కాస్ట్యూమ్స్‌గా కొన్ని రోజులు వాడారు.
► ఈ సినిమా మొత్తాన్ని మూడు షెడ్యూల్స్‌లో 50 రోజుల్లో పూర్తి చేశారు.
► షూటింగ్స్, సెన్సార్‌ వంటి అవరోధాలన్నీ దాటినప్పటికీ ఈ సినిమాను కొనుగోలు చేయడానికి పంపిణీదారులెవ్వరూ ముందుకు రాలేదు. ఇదేదో రాజకీయ పాఠాలు చెబుతున్న సినిమాలా ఉందని కామెంట్‌ చేశారట. చివరికి లక్ష్మీ ఫిలింస్, శ్రీ తారకరామా ఫిలింస్‌ వారు ఈ సినిమాను విడుదల చేశారు.
► ఈ సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించిన రవీంద్రనాథ్, ఆయన భార్య సినిమా విడుదలైన మూడో రోజు సినిమా చూడటానికి థియేటర్‌కి వెళ్లారు. కానీ వారికి కూడా టికెట్లు దొరకలేదట.
► ‘చిల్లర దేవుళ్లు’ తర్వాత సినిమా సంభాషణల్లో పూర్తి స్థాయి తెలంగాణ యాసను  వాడిన సినిమా ఇదే.
► యూనిట్‌ దగ్గర ఉన్న కొత్త చీరలు, రుమాల్లు, పంచెలు గ్రామంలో వారికి ఇచ్చి వారి దగ్గర ఉన్న పాత బట్టలు తీసుకుని చిత్రీకరణ కోసం వినియోగించేవారట చిత్రబృందం.
► తొలుత ఈ సినిమాకు ‘జైత్రయాత్ర’ అనే టైటిల్‌ని పరిశీలించారట.  భూమి కోసం పోరాటం జరుగుతుంది. ‘మన భూమి’ పెడితేనే బావుంటుందని నర్సింగరావు సూచించారట.
► సినిమాలో గడీను ముట్టడి చేసే సన్నివేశాల చిత్రీకరణకు ఆ గ్రామ ప్రజలు సహకరించలేదు. చివరికి వారి అనుమతి లేకుండానే చిత్రబృందం తయారు చేయించుకొని తెచ్చుకున్న తలుపును బద్దల కొట్టినట్టుగా షూట్‌ చేశారు.
► 1948లో హైదరాబాద్‌ రాష్ట్రంపై భారతప్రభుత్వం చేసిన సైనిక చర్యకు సంబంధించిన సన్నివేశాలనే సినిమాలో వినియోగించుకున్నారు.  ∙పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు నటీనటుల గాయాలకే రోజుకో ఐయోడిన్‌ సీసా ఖాళీ అయ్యేదట.
► చిత్రకారుడు తోట వైకుంఠం ఈ సినిమాకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పని చేశారు.. ఇదే తొలి సినిమా.
► దేవీప్రియ ఈ సినిమాకు పబ్లిసిటీ ఇన్‌చార్జ్‌గా పని చేశారు.
► ఈ సినిమాలోని ‘పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడా..’ పాటను సీనియర్‌ రచయిత సుద్దాల హనుమంతు రచించారు. ప్రస్తుతం ప్రముఖ గేయ రచయితగా కొనసాగుతున్న సుద్దాల అశోక్‌ తేజ ఆయన కుమారుడే.
► సినిమా చిత్రీకరిస్తున్న రోజుల్లో యూనిట్‌ మొత్తం మంగళ్‌ పర్తిలోనిæ బడిలో నివసించారు. ఆ పక్కనే ఉన్న బావి దగ్గర మగవాళ్లు స్నానాలు చేసేవారు. స్త్రీలేమో ఆ ఊర్లోని సంపన్న కుటుంబీకుల ఇంట్లోని స్నానాల గదులు వాడుకునేవారట.
► ఈ సినిమా నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది. 
► ఈ సినిమా నెగటివ్‌ పాడైపోవడంతో 2015 ప్రాంతంలో డిజిటలైజ్‌ చేసి డీవీడీ విడుదల చేశారు.


‘మాభూమి’ చిత్రంలో సాయిచంద్‌


సాయిచంద్, రమణి


మాభూమి షూటింగ్‌ సందర్భంగా గద్దర్, దర్శకుడు గౌతమ్, బి.నరసింగరావు, నీలంబన ఘోష్‌
 
– గౌతమ్‌ మల్లాది

మరిన్ని వార్తలు