నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

30 Aug, 2019 11:05 IST|Sakshi

చెన్నై: నడిగర్‌సంఘం (దక్షిణభారత నటీనటుల సంఘం) కార్యవర్గానికి తీపివార్త. ఆ సంఘం భవన నిర్మాణానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లితే స్థానిక టీ.నగర్, అబిబుల్లా రోడ్డులో నడిగర్‌ సంఘం కార్యాలయం ఉంది. కాగా అక్కడ పాత భవనాన్ని కూల్చివేసి నూతనంగా బహుళ ప్రయోజనాలతో కూడిన భవన సముదాయాన్ని ఆ సంఘ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంఘానికి చెందిన స్థలానికి పక్కన ఉన్న 33 చదరపు అడుగుల ప్రకాశం రోడ్డును ఆక్రమించుకున్నారంటూ స్థానిక టీ.నగర్, విద్యోదయ కాలనీకి చెందిన శ్రీరంగం, అన్నామలై అనే వ్యక్తులు మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఆక్రమణ వ్యవహారం గురించి పరిశీలించి వివరాలను కోర్టుకు అందజేయాల్సిందిగా న్యాయాధికారిని నియమించి, ఆయనకు ఆదేశించింది. ఈ కేసు చాలా కాలంగా విచారణలో ఉంది. ఈ క్రమంలో ఆ న్యాయాధికారి నడిగర్‌సంఘ భవన నిర్మాణం ఎలాంటి ఆక్రమిత స్థలంతో నిర్మించడం లేదన్న విషయాన్ని న్యాయస్థానానికి ఆధారాలతో సహా సమర్పించారు. దీంతో ఈ కేసుపై తుది తీర్పును బుధవారం వెల్లడించారు. దీంతో న్యాయమూర్తులు కృపాకరన్, పార్థిబన్‌ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు.   

>
మరిన్ని వార్తలు