కశ్మీర్‌లో ఆర్మీ చీఫ్‌ పర్యటన

30 Aug, 2019 11:14 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం తొలిసారిగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ నేడు(శుక్రవారం) కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా లోయలో భద్రతా పరిస్థితులను సమీక్షించనున్నారు. అదే విధంగా దాయాది దేశం పాకిస్తాన్‌ కయ్యానికి కాలుదువ్వుతున్న వేళ కశ్మీర్‌లో భద్రతా బలగాల సన్నద్ధతను పర్యవేక్షించనున్నారు. కాగా ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి లోయలో ప్రశాంత వాతావరణం ఉందని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో సాధారణ పౌరులెవరూ గాయపడలేదని, వారంతా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇక జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ అక్కడ పర్యటించి స్థానికులతో సమావేశమైన విషయం తెలిసిందే.

చదవండి: పాక్‌ దూకుడు.. అర్ధరాత్రి రహస్యంగా...

ఇదిలా ఉండగా.. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్‌... కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులపై జోక్యం చేసుకోవాల్సిందిగా ఐక్యరాజ్యసమితికి లేఖ రాసిన విషయం విదితమే. లోయలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు సహా కశ్మీరీ యువతుల గురించి హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, బీజేపీ ఎమ్మెల్యే విజయ్‌ సైనీ వ్యాఖ్యల గురించి తన లేఖలో ప్రస్తావించింది. మరోవైపు కశ్మీర్‌ విషయంలో భారత్‌తో అణు యుద్ధానికైనా సిద్ధమని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ప్రకటించిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దాయాది దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందులో భాగంగా అణు బాలిస్టిక్‌ క్షిపణి ‘ఘజ్నవి’ని గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఇప్పటికే కరాచీలోని మూడు గగనతల మార్గాలను మూసివేసి, నిత్యం భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతున్న పాక్‌ ఇప్పుడు ఏకంగా అణు క్షిపణిని పరీక్షించి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోంది. కాగా అణు వార్‌హెడ్లను (అత్యధిక తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలు) మోసుకెళ్లే సామర్థ్యమున్న ఈ క్షిపణి  290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదని ఆర్మీ తెలిపింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే దీని ద్వారా భారత దేశంలోని కొంత భూభాగాన్ని సైతం లక్ష్యంగా చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

చదవండి : వారిద్దరి పేర్లను కూడా ప్రస్తావించిన పాక్‌!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా