ప్రకాశ్‌రాజ్ మన ఊరి రామాయణం

13 Aug, 2016 00:59 IST|Sakshi
ప్రకాశ్‌రాజ్ మన ఊరి రామాయణం

మన ఊరి మెయిన్ రోడ్డు పక్కన శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద పోస్టర్ ఉంది చూశావ్ కదా. అందులో నమస్కారం పెడుతూ కనిపించిన పెద్దాయనే భుజంగయ్య. మొన్ననే దుబాయ్ నుంచి తిరిగొచ్చారు. దానధర్మాలు గట్రా బాగానే చేస్తుంటారు - ఊరి రచ్చబండ దగ్గర ఒకాయన భుజంగయ్య గురించి గొప్పగానే చెబుతున్నాడు. ఆ శ్రీరామనవమి రోజు జరిగిన ఓ సంఘటన భుజంగయ్య జీవితాన్ని మలుపు తిప్పింది.
 
 ఆ సంఘటన ఏంటి? శ్రీరామనవమి నాడు ఏం జరిగింది? అనే కథాంశంతో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘మన ఊరి రామాయణం’. ప్రకాశ్‌రాజ్ ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. కన్నడలో ‘ఇదొల్లె రామాయణ’గా తెరకెక్కింది. ప్రియమణి, సత్యదేవ్, పృథ్వీ, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
 
  ‘‘ప్రతి మనిషిలోనూ ఓ రాముడు, ఓ రావణుడు ఉంటారు. వారి గురించి చెప్పే చిత్రమిది’’ అన్నారు ప్రకాశ్‌రాజ్. ఫస్ట్ కాపీ పిక్చర్స్, ప్రకాశ్‌రాజ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కథ: జాయ్ మాథ్యూ, మాటలు: రమణ గోపిశెట్టి, ప్రకాశ్‌రాజ్, సంగీతం: ఇళయరాజా, పాటలు: భాస్కరభట్ల, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, కెమేరా: ముకేశ్, నిర్మాతలు: రామ్ జీ, ప్రకాశ్‌రాజ్.