Diwali 2023 Special Movie Posters: పండగ పోస్టర్‌ గురూ 

14 Nov, 2023 00:48 IST|Sakshi

దీపావళి పండక్కి ఇండస్ట్రీలో సినీ టపాసులు బాగానే పేలాయి. టీజర్, ట్రైలర్, ఫస్ట్‌ లుక్, కొత్త పోస్టర్‌.. ఇలా సినీ ప్రేమికులకు కావాల్సిన మతాబులు అందాయి. ఈ విశేషాల్లోకి... 

రజనీకాంత్, కపిల్‌దేవ్‌ కీలక పాత్రల్లో విష్ణు విశాల్, 
విక్రాంత్‌ హీరోలుగా జీవితా రాజశేఖర్‌ ఓ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాల్‌ సలామ్‌’. సుభాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. దీపావళి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. క్రికెట్‌ను ప్రేమించే కొందరు హిందు, ముస్లిం యువకుల మధ్య రాజకీయ జోక్యంతో తలెత్తిన వివాదాలను మొయిద్దీన్‌ భాయ్‌ (రజనీ పాత్ర పేరు) ఎలా సరిదిద్దుతాడు? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని యూనిట్‌ చెబుతోంది.  

‘రాంగ్‌ యూసేజ్‌’ అంటూ ‘సైంధవ్‌’ సినిమా కోసం పాట పాడారు వెంకటేశ్‌. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వెంకటేశ్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘రాంగ్‌ యూసేజ్‌’ పాట లిరికల్‌ వీడియోను ఈ నెల 21న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించి, ఈ సాంగ్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది.  

రవితేజ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్‌ చిత్రం ‘ఈగల్‌’. ఇందులో కావ్యాథాపర్, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ విడుదలైంది. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13న విడుదల కానుంది.  

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్‌ ఫిల్మ్‌ ‘సలార్‌’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ‘సలార్‌: సీజ్‌ఫైర్‌’ డిసెంబరు 22న విడుదల కానుంది. తొలి భాగం ట్రైలర్‌ను డిసెంబరు 1న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించి, ప్రభాస్‌ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విజయ్‌ కిరంగదూర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 

మాస్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న తాజా యాక్షన్‌ ఫిల్మ్‌ ‘భీమా’. ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోపీచంద్‌ సరసన ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఓ మాస్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.  

సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కంగువా’. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్‌. దీపావళి సందర్భంగా ‘కంగువా’ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. యూవీ క్రియేషన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. రెండు విభిన్న కాలాల్లో సాగనున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఏప్రిల్‌ 11న విడుదల కానుందని టాక్‌. 

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’. పరశురామ్‌ పెట్ల దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ విడుదలైంది. ఈ సినిమా తాజా షూటింగ్‌ షెడ్యూల్‌ను బ్యాంకాక్‌లో ప్లాన్‌ చేశారు. సంక్రాంతికి ‘ఫ్యామిలీ స్టార్‌’ విడుదల కానుంది. 

ఎన్టీఆర్‌ పెద్ద కుమారుడు జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బ్రీత్‌’. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యంతో హాస్పిటల్‌లో జాయిన్‌ అయిన తర్వాత చోటు చేసుకునే ఘటనల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని యూనిట్‌ చెబుతోంది. 

ప్రముఖ నటుడు ఉపేంద్ర భార్య, నటి ప్రియాంకా ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘క్యాప్చర్‌’. ఈ సినిమాకు లోహిత్‌ దర్శకుడు. రాధికా కుమారస్వామి సమర్పణలో రవిరాజ్‌ నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ‘‘ఇప్పటి వరకూ సినీ ప్రపంచంలో రాని ఓ ప్రయోగాత్మక చిత్రం ఇది. సింగిల్‌ లెన్స్‌తో తీసిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే. సినిమా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్‌ నుంచి షూట్‌ చేసినట్టుగా అనిపిస్తుంది. 30 రోజులు గోవాలో ఏకధాటిగా షూటింగ్‌ జరిపాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సతీమణి, నటి రాధికా కుమారస్వామి నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘అజాగ్రత్త’. శశిధర్‌ దర్శకత్వంలో రవిరాజ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏడు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే రాధికా కుమారస్వామి నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘భైరా దేవీ’. శ్రీ జై దర్శకత్వం వహిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే అఘోరా భైరాదేవిగా రాధిక నటిస్తున్నారు. 

క్యూబా పోరాటయోధుడు చేగువేరా జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రూపొందుతున్న సినిమా ‘చే’. ‘లాంగ్‌ లివ్‌’ అనేది ఉపశీర్షిక. లావణ్య సమీరా, పూల సిద్ధేశ్వర్, కార్తీక్‌ నూనె, వినోద్, పసల ఉమామహేశ్వర్, బి.ఆర్‌ సభావత్‌ నాయక్‌ కీలక పాత్రల్లో నటించారు. బి.ఆర్‌ సభావత్‌ నాయక్‌ దర్శకత్వంలో సూర్య, బాబు, దేవేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ‘‘చేగువేరా బయోపిక్‌ తీయాలన్నది నా 20 ఏళ్ల కల. విప్లవ వీరుడు చేగువేరా లైఫ్‌లో జరిగిన ఎన్నో అరుదైన విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. డిసెంబరులో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు బి.ఆర్‌ సభావత్‌ నాయక్‌.    
 

మరిన్ని వార్తలు