అదే వరెస్ట్‌ మూమెంట్‌: మనీష్‌ మల్హోత్రా

29 Feb, 2020 11:09 IST|Sakshi

ముంబై: అతిలోక సుందరి శ్రీదేవి మరణించడం తన జీవితంలోని అత్యంత బాధాకరమైన విషయాల్లో ఒకటని బాలీవుడ్‌ ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా అన్నాడు. శ్రీదేవి శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచివెళ్లడం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశాడు. మోడల్‌గా కెరీర్‌ ఆరంభించి.. బాలీవుడ్‌ స్టార్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఎదిగిన మనీష్‌ మల్హోత్రా తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనల గురించి ప్రఖ్యాత హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే పేజీతో పంచుకున్నాడు. తాను సంప్రదాయ పంజాబీ కుటుంబంలో జన్మించానని, బాలీవుడ్‌ మీద ఉన్న ప్రేమతో ఎంతో కష్టపడి ఈ రంగంలో అడుగుపెట్టానని పేర్కొన్నాడు. 

‘‘సాధారణ కుటుంబంలో పుట్టిన నాకు... విదేశాల్లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చదివేంత స్థోమత లేదు. అందుకే సొంతంగానే డిజైనింగ్‌ నేర్చుకున్నా. గంటల తరబడి స్కెచెస్‌ గీసేవాణ్ణి. మొదట్లో ఓ బొటిక్‌లో మోడల్‌గా పనిచేసేవాడిని. అప్పుడు నా నెల జీతం రూ. 500. బాలీవుడ్‌ సినిమాలు చూస్తూ సమయం గడిపేవాడిని. ఇలా జీవితం సాగిపోతుండగా... 25 ఏళ్ల వయస్సులో నా కెరీర్‌ ప్రారంభమైంది. జూహీ చావ్లా సినిమాలో పనిచేసే అవకాశం లభించింది.

ఆ తర్వాత 1995లో విడుదలైన ‘రంగీలా’ సినిమాతో నా కెరీర్‌ మలుపు తిరిగింది. ఆ సినిమాకు బెస్ట్‌ క్యాస్టూమ్‌ డిజైనర్‌గా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు వచ్చింది. ఇలా 30 ఏళ్ల కెరీర్‌లో ఎన్నెన్నో విజయాలు లభించాయి. ఇక నా జీవితంలో అత్యంత బాధపడిన, చెత్త విషయం ఏదైనా ఉందంటే అది శ్రీదేవి మరణమే’’ అని మనీష్‌ చెప్పుకొచ్చాడు. కాగా బాలీవుడ్‌ అగ్ర తారలందరికీ అభిమాన ​క్యాస్టూమ్‌ డిజైనర్‌గా ఉన్న మనీష్‌ మల్హోత్రా.. శ్రీదేవికి కూడా వ్యక్తిగత డిజైనర్‌గా ఉండేవారు. ప్రస్తుతం ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌లకు కూడా దుస్తులు డిజైన్‌ చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు