బందూక్ ఓ అద్భుతం!

11 Dec, 2014 23:27 IST|Sakshi
బందూక్ ఓ అద్భుతం!

 ‘‘ఈ 14 ఏళ్లలో రెండే సినిమాలు చూశా. ఒకటి ఎన్.శంకర్ తీసిన ‘జై బోలో తెలంగాణ’, రెండోది మా ‘రసమయి’బాలకిషన్ తీసిన ‘జై తెలంగాణ’. ఇప్పుడు గోరటి వెంకన్న పాట వినగానే ‘బందూక్’ సినిమా చూడాలనిపిస్తోంది’’ అని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖమంత్రి జగదీశ్వరరెడ్డి అన్నారు. 24 శాఖల్లోనూ తెలంగాణ కళాకారులు పనిచేస్తున్న చిత్రం ‘బందూక్’. లక్ష్మణ్ మురారి(బాబి) దర్శకత్వంలో గుజ్జ యుగంధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం గోరటి వెంకన్న రాయగా, కార్తీక్ కొడకండ్ల సంగీత దర్శకత్వంలో సాకేత్ పాడిన బ్రెత్‌లెస్ సాంగ్‌ను గురువారం హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్వరరెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు.
 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ జిల్లాల చరిత్రను ఒక్కపాటలో పొందుపరచే సాహసం చేసి, సఫలమయ్యారు గోరటి వెంకన్న. ఈ పాట ఓ అద్భుతం. ఇలాంటి సినిమాలతో బంగారు తెలంగాణతో పాటు బంగారు సినీ పరిశ్రమను కూడా సాధించుకుందాం’’ అని జగదీశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఎం.పి. జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్, దర్శకుడు శంకర్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, బీజేపీ నేత కృష్ణసాగర్ తదితరులు పాల్గొన్నారు.