లక్కీచాన్స్‌..!

19 Sep, 2017 04:08 IST|Sakshi
లక్కీచాన్స్‌..!

తమిళసినిమా: జిమికి కమ్మల్‌ షెరిల్‌కి కోలీవుడ్‌ నుంచి లక్కీచాన్స్‌ వరించనుందన్న టాక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకీ ఎవరీ షెరిల్‌? ఇటీవల యూట్యూబ్‌ను ఫాలో అవుతున్న కర్రకారు అందరికీ ఈ పేరు తెలుసు. ఆమె డాన్స్‌ను పదే పదే చూసేశారు. అసలు విషయం ఏమిటంటే మలయాళంలో నటుడు మోహన్‌లాల్‌ నటించిన వెలిపడింటే పుస్తకం అనే చిత్రం ఇటీవలే విడుదలైంది. అందులో జిమికి కమ్మల్‌ అనే పల్లవితో సాగే పాట చోటు చేసుకుంది.

ఆ పాటకు ఓనం పండగ సందర్భంగా అక్కడి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ కామర్స్‌ విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి డాన్స్‌ చేశారు. అంతే కాదు ఆ డాన్స్‌ను వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారు. ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఆ పాటకు ముందు వరుసలో డాన్స్‌ చేసిన షెరిల్‌ అనే యువతికి విపరీతమైన ఫాలోయింగ్‌ వచ్చేసింది. తను ఉపాధ్యాయిని అట. ఇంకేముంది కొందరు మీడియా బృందం షెరిల్‌ను ఇంటర్యూ చేశారు. అప్పుడామె తనకు విజయ్, అజిత్‌ అంటే చాలా ఇష్టం అని వారికి తాను వీరాభిమాని అని చెప్పింది.

అంతే కోలీవుడ్‌ షెరిల్‌ను హీరోయిన్‌ చేసే పనిలో పడిందన్నది తాజా సమాచారం. అంతేకాదు ఏకంగా ఇలయదళపతి విజయ్‌తో రొమాన్స్‌ చేసే లక్కీచాన్స్‌ తలుపు తట్టిందనే టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. దర్శకుడు కేఎస్‌.రవికుమార్‌ ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణ హీరోగా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తరువాత విజయ్‌ హీరోగా నటించే చిత్రానికి దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అందులో షెరిల్‌ను నాయకిగా ఎంపిక చేసే విషయంలో చర్చలు జరుగుతున్నట్టు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదన్నది గమనార్హం.