ఎవరెవరితో స్నేహం చేస్తున్నానో నాన్న ఓ కంట కనిపెట్టేవారు..!

2 Aug, 2014 23:44 IST|Sakshi
ఎవరెవరితో స్నేహం చేస్తున్నానో నాన్న ఓ కంట కనిపెట్టేవారు..!

  మీ స్నేహితుల గురించి తెలుసుకోవాలని ఉంది..!
 వాళ్ల పేర్లు చెప్పాలంటే లిస్ట్ చాలా ఉంది. అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ స్కూల్, కాలేజ్ డేస్ నుంచీ నాతో ట్రావెల్ అవుతున్నవారే. మేమంతా కలిశామంటే సందడికి కొదవ ఉండదు.
 
  ఫ్రెండ్‌షిప్ డేకి ప్రత్యేకంగా పార్టీ చేసుకుంటారా?
 అలా ఏమీ లేదండి. 365 రోజుల్లో ఏదో ఒక సందర్భంలో మన ఫ్రెండ్స్‌తో టచ్‌లో ఉంటాం. ఇక, ప్రత్యేకంగా ఈ రోజు కలుసుకుని పార్టీ చేసుకోవడం దేనికి? అయితే, ఫ్రెండ్‌షిప్ డే నాడు ఒకటి చేయొచ్చు. చిన్నపాటి మనస్పర్థలతోనో, పెద్ద పెద్ద గొడవల కారణంగానో విడిపోయిన స్నేహితులకు ‘సారీ’ చెప్పుకుని తిరిగి కలవడానికి ఈ రోజుని వినియోగించుకోవచ్చు.
 
  మీకలా ఎవరైనా ఉన్నారా?
 లేరు. ఏదైనా మాటా మాటా అనుకున్నా... ఆ క్షణం వరకే. ఆ తర్వాత మామూలుగా మాట్లాడేసుకుంటాం.
 
  అసలు ఫ్రెండ్స్ ఉండాలంటారా?
 తప్పకుండా. ఎందుకంటే, అన్ని విషయాలనూ ఇంట్లోవాళ్లతో చెప్పుకోలేం. ఏ విషయాన్నయినా పంచుకోగలిగేది స్నేహితులతో మాత్రమే.
 
  మీ స్నేహితులతో మీరు అన్నీ చెప్పుకుంటారా?
 మానసికంగా, శారీరకంగా ఎప్పుడైనా ‘డౌన్’ అయ్యాననుకున్నప్పుడు చెప్పుకుంటాను. దాంతో కొంచెం భారం దిగినట్లనిపిస్తుంది.
 
  చిన్నప్పుడు ఎవరితో పడితే వాళ్లతో స్నేహం చేయొద్దని అమ్మానాన్న చెబుతుంటారు. మరి.. మీ నాన్నగారు ఆ విషయంలో ఏమైనా సలహాలిచ్చేవారా?
 నేనెవరెవరితో స్నేహం చేస్తున్నానో నాన్నగారు ఓ కంట కనిపెట్టేవారు. ఒకవేళ ఎవరైనా కరెక్ట్ కాదనిపిస్తే, ‘అతనితో స్నేహం వద్దు’ అని చెప్పేవారు. అమ్మానాన్న తమ అనుభవంతో అన్నీ చెబుతుంటారు కాబట్టి, వాళ్ల సలహాని పాటించేవాణ్ణి.
 
 ఇప్పుడు మీకు తగ్గ స్నేహితులను జడ్జ్ చేయడంలో మీరెంతవరకు బెస్ట్?
 ఈ విషయంలో గతంలో కొన్ని తప్పులు చేశాను. కానీ, ఇప్పుడలా కాదు. తొలిసారి కలిసినప్పుడే నేను ఎవరి గురించైనా పూర్తిగా కాకపోయినా కొంతవరకూ తెలుసుకోగలుగుతున్నాను.
 
  ఆడ, మగ స్నేహం అంటే విడ్డూరంగా చెప్పుకుంటారు.. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల్లో మార్పు రావడం గమనించారా?
 నాకు తెలిసి స్నేహానికి జెండర్‌తో పని లేదు. అభిప్రాయాలు కలిసినప్పుడు స్నేహం చేయొచ్చు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు ఆడ, మగ మధ్య స్నేహాన్ని వక్రీకరించడంలేదు. అందుకు ఆనందంగా ఉంది. ఎందుకంటే, స్వచ్ఛమైన స్నేహాన్ని ఆమోదించాలే తప్ప అభ్యంతరకరమైన అర్థాలు తీయకూడదు.
 
  మీకు ప్రత్యేకంగా లేడీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా?
 పర్టిక్యులర్‌గా లేరు. కానీ, నాకున్న చాలామంది స్నేహితుల్లో అమ్మాయిలు కూడా ఉన్నారు.
 
  మీ ఫ్రెండ్స్ అందరిలోకెల్లా మీరు ‘స్టార్’ కాబట్టి.. ప్రత్యేకంగా చూస్తారా?
 అలా ఏం లేదు. నాతో చాలా మామూలుగా ప్రవర్తిస్తారు. నా ఫ్రెండ్స్ దగ్గర నాకు నచ్చిన లక్షణం అదే. ఫ్రెండ్‌షిప్‌లో హోదా ప్రదర్శిస్తే అది స్నేహం కాదు.
 
  స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏం చెప్పాలనుకుంటారు?
 ‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్‌డీడ్’ అనే విషయాన్ని నేను నమ్ముతాను. వృత్తిరీత్యా బిజీ బిజీగా ఉంటాం. ఇంటిపట్టున ఉండేది తక్కువ. అలాంటప్పుడు బయటి ప్రపంచంలో ఉన్న స్నేహితులతోనే ఎక్కువగా గడుపుతాం. అందుకే స్నేహితులు ఉండాలి!
 

whatsapp channel