నాకు ఎప్పటినుంచో ఇలాంటి ఆలోచన ఉంది!

13 Dec, 2013 00:52 IST|Sakshi
నాకు ఎప్పటినుంచో ఇలాంటి ఆలోచన ఉంది!
కొత్తదనానికి కేరాఫ్ అడ్రస్... నాగార్జున. కథానాయకునిగా ఆయన పరిచయం చేసిన కొత్త దర్శకుల జాబితా చాలానే ఉంటుంది. నిర్మాతగా కూడా ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు చేసిన ఆయన, తన ట్రెండ్ మార్చి కొత్త కాన్సెప్ట్‌తో.. లోబడ్జెట్‌లో క్యూట్ ఫిలిమ్స్ చేయడానికి సిద్ధమయ్యారు. అందుకు ‘ఉయ్యాల జంపాల’ సినిమా  ఆరంభం అంటున్నారాయన. తాను నిర్మాణ భాగస్వామిగా  వ్యవహరించిన ‘ఉయ్యాల జంపాల’ గురించి, ‘మనం’ సినిమా గురించి, ఏయన్నార్ ఆరోగ్యం గురించి, అఖిల్ తెరంగేట్రం గురించి ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. 
 
 అటు మీ నాన్నగారితో, ఇటు మీ అబ్బాయితో కలిసి చేస్తున్న ‘మనం’ కోసం అందరూ ఉద్వేగంగా ఎదురు చూస్తున్నారు!
 ప్రేక్షకులతో పాటు నేనూ ఎగ్జైటింగ్‌గానే ఉన్నాను. ఆ షూటింగ్ పని మీదే మైసూర్‌లో ఉన్నాను. ఈ నెల 21 వరకూ ఇక్కడే షూటింగ్. దాంతో 90 శాతం సినిమా పూర్తయినట్టే. నాన్నగారి వెర్షన్ షూటింగ్ అయిపోయింది. ఆయన డబ్బింగ్ కూడా చెప్పేశారు. మార్చి నెలాఖరుకి సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. 
 
 ఏయన్నార్‌గారి ఆరోగ్యం ఎలా ఉంది?
 దేవుడి దయ వల్ల చాలా బావున్నారు. త్వరగానే రికవర్ అవుతున్నారు. జరిగింది మేజర్ సర్జరీ కాబట్టి కొంచెం టైమ్ పడుతుంది. సర్జరీ తర్వాత నాన్నగారు షూటింగ్ చేశారు. డబ్బింగ్ కూడా చెప్పారు. ఆయనకున్న విల్‌పవర్ చాలా స్ట్రాంగ్.
 
 ‘మనం’లో అఖిల్ యాక్ట్ చేశాడటగా?
 ఎన్నో ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అన్నీ కరెక్ట్ కావు. అయినా అఖిల్ వచ్చే ఏడాది అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నాడు. 
 
 అఖిల్ తొలి చిత్రానికి దేవకట్టా దర్శకుడటగా?
 ఆ వార్త నేనూ విన్నాను. దేవా మాకు బాగా కావల్సినవాడు. చైతన్యతో ‘ఆటోనగర్ సూర్య’ చేశాడు. చైతన్యకి క్లోజ్ తను. అలాగే అఖిల్‌కి కూడా. అఖిల్ తన దగ్గరే తెలుగు నేర్చుకుంటున్నాడు. అయినా అఖిల్ ఫస్ట్ సినిమా ఎవరితో అనేది ఇంకా ఫైనలైజ్ చేయలేదు.
 
 అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థలో వరుసగా సినిమాలు చేస్తున్నట్టున్నారు?
 అవును. చేయాలి కదా. మా కుటుంబానికి సినిమాలే కదా ప్రపంచం. ‘గుండె జారి గల్లంతయ్యింది’ ఫేమ్ విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో నాగచైతన్యతో ఈ రోజు ఓ సినిమా మొదలుపెట్టాం. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అది. మే నెలలో ఆ సినిమా రిలీజ్ ఉంటుంది.
 
 ‘ఉయ్యాల జంపాల’లాంటి చిన్న సినిమాతో మీరు అసోసియేట్ కావడానికి ప్రధాన కారణం?
 నాకు ఎప్పటినుంచో ఇలా కొత్త తరహాలో చిన్న సినిమాలు చేయాలన్న ఆలోచన ఉంది. అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూలు వంటి మంచి సినిమాలు తీసిన రామ్మోహన్ ఈ కథతో నన్ను కలిశాడు. కథలోని కొత్తదనం, వాళ్ల తపన నన్ను ఆకట్టుకున్నాయి. అందుకే కలిసి పనిచేద్దామని నిశ్చయించుకున్నాం. సురేష్‌బాబు కూడా మాతో కలవడం ఇంకా హ్యాపీ.
 
 ఈ కథలో మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న అంశాలేంటి?
 మనకు పల్లెటూరి నేపథ్యంలో సినిమాలు వచ్చి చాలా కాలమైంది. అయినా అప్పటికీ ఇప్పటికీ పల్లెటూళ్లలో చాలా మార్పులు వచ్చేశాయి. అక్కడి కుర్రకారు టెక్నాలజీలో కూడా అప్‌డేట్‌గా ఉంటున్నారు. వాళ్లకి టచ్ ఫోన్లు, ఫేస్‌బుక్‌లు, ఈ మెయిల్స్... ఇలా అన్నిటి గురించీ తెలుసు. వాళ్ల ఆలోచనా విధానం కూడా చాలా మారిపోయింది. అయితే ఆ పల్లెటూరి తాలూకు అమాయకత్వం మాత్రం పోలేదు. అలాగే వెటకారం కూడా. వీటన్నిటినీ ప్రతిబింబిస్తూ చాలా వినోదాత్మకంగా ఈ కథను తీర్చిదిద్దారు. బావా మరదళ్ల కథ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పల్లెటూరికి చెందిన ఆధునిక ప్రేమకథ ఇది. మొన్నీమధ్యనే సినిమా చూశాను. విపరీతంగా నచ్చింది. మా సంస్థ ఆధ్వర్యంలో తీసినందుకు ఆనందంగానూ, గర్వంగానూ ఫీలవుతున్నా.
 
 మీలాంటి స్టార్స్ ఇలాంటి చిన్న సినిమాలు తీస్తే వాటికీ డిమాండ్ పెరుగుతుందిగా?
 అవును. ఆ ట్రెండ్‌కి ‘ఉయ్యాల జంపాల’ ఒక ఆరంభం అనుకోవాలి. ఇకముందు కూడా ఇలాంటివి చేస్తాం.
 
 మీకు డిసెంబర్ అంటే లక్కీ మంత్. ఆ సెంటిమెంట్‌తోనే ఈ చిత్రాన్ని క్రిస్మస్‌కి విడుదల చేస్తున్నారా?
 ఇప్పుడు ఏ సినిమాకైనా రిలీజ్ డేట్ అనేది చాలా ముఖ్యం. 2, 3 వారాల వెసులుబాటు కావాలి. క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకూ హాలిడేస్ ఉంటాయి కాబట్టి సినిమా ఎక్కువమందికి రీచ్ అవుతుంది. 
 
 సెంచరీకి చేరువవుతున్నట్టున్నారు..!
 ఇప్పటికి 88 సినిమాలు పూర్తయ్యాయి. ఇంకా 12 పూర్తి చేయాలంటే నాలుగైదేళ్లు పడుతుంది.
 
 తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్ పుంజుకుంటోంది. దీని గురించి మీరేమంటారు?
 అందరికీ ఆనందదాయకమైన విషయం ఇది. నేనెప్పట్నుంచో మల్టీస్టారర్లు రావాలని చెబుతున్నాను. నేను కూడా కొన్ని చేశాను. మా జనరేషన్ హీరోలు, యంగ్ హీరోలు కలిసి మల్టీస్టారర్లు చేస్తే ఇంకా మంచి కథలొస్తాయి. అయితే దర్శకులు బాగా తీయగలగాలి.
 
 ‘మనం’ తర్వాత ఏం చేస్తున్నారు?
 ఇంకా ఏవీ ఒప్పుకోలేదు. ఇప్పుడు నా కాన్‌సన్‌ట్రేషన్ అంతా ‘మనం’ మీదే. ఇది మాకు చాలా స్పెషల్ మూవీ. అందుకే ‘మనం’ తర్వాత నేనేం చేయాలన్నది నిర్ణయించుకుంటాను.
 
 ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ కోసం మీరో జట్టుని స్పాన్సర్ చేస్తున్నారుగా. ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
 క్రికెట్ తర్వాత మన దేశంలో బ్యాడ్మింటనే పాపులర్. అందరికీ తెలిసిన గేమ్ అది. అందరూ ఏదో ఒక సమయంలో ఈ గేమ్ ఆడే ఉంటారు. నేను కూడా చిన్నప్పట్నుంచీ బ్యాడ్మింటన్ బాగా ఆడేవాణ్ణి. నాన్నగారు, అమ్మ రోజూ సాయంత్రం బ్యాడ్మింటన్ ఆడేవారు. బ్యాడ్మింటన్‌కి ఎప్పుడూ భవిష్యత్తు ఉంటుంది. మాలాంటివాళ్లు ముందుకు రావడం వల్ల కొత్త ప్లేయర్స్ వస్తారు.