నాని నాలుగు సినిమాలు

12 Aug, 2016 11:47 IST|Sakshi
నాని నాలుగు సినిమాలు

ఈ జనరేషన్ హీరోలు ఏడాది ఒక్క సినిమా చేయడానికి కష్టపడుతుంటే ఓ యంగ్ హీరో మాత్రం ఈ ఏడాది నాలుగు సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేసిన ఈ హీరో మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. గతంలో అల్లరి నరేష్ ఇదే స్పీడులో సినిమాలో చేసినా వరుస ఫ్లాప్లతో కాస్త స్లో అయ్యాడు. సీనియర్ హీరో రవితేజ కూడా ఫాం కోల్పోవటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

ఇప్పుడు ఈ ప్లేస్ను నేచురల్ స్టార్ నాని తీసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాని, జూన్లో జెంటిల్మన్గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తున్న నాని, ఈ సినిమాను సెప్టెంబర్ 17న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.

ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు. దిల్ రాజు నిర్మాణంలో సినిమా చూపిస్త మామా ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నేను లోకల్ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకురానున్నాడు. ఈ సినిమాలో అందాల రాక్షసి ఫేం నవీన చంద్ర విలన్గా నటిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాదే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు నాని.