క్రికెటర్ల కష్టం తెలిసింది – నాని

8 Apr, 2019 23:32 IST|Sakshi

‘‘గౌతమ్‌ ‘జెర్సీ’ కథ చెప్పగానే ఓకే అన్నాను. త్వరగా సెట్స్‌పైకి వెళ్లడం.. త్వరత్వరగా చిత్రీకరణ పూర్తవడం... ఈ సినిమా పోస్టర్లు, టీజర్‌ చూసి క్రికెట్‌ నేపథ్యంలో ఉంటుందనుకుంటున్నారు. కానీ, చాలా ఎమోషనల్‌గా ఉంటుంది’’ అన్నారు నాని. ఆయన హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘జెర్సీ’ ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘36 ఏళ్ల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్‌ అనే రంజీ క్రికెటర్‌ కథ ఇది. రంజీ మ్యాచ్‌లు ఆడుతున్న అతను అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనే ప్రయత్నంలో ఉంటాడు. నేను స్కూల్‌డేస్‌లో క్రికెట్‌ ఆడేవాణ్ణి. సినిమా పిచ్చి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఆడటం మానేశాను. ‘జెర్సీ’ కోసం ట్రైనింగ్‌ తీసుకుని ఆడాల్సి వచ్చింది. నేను, నిర్మాత నాగవంశీ స్కూల్‌డేస్‌లో క్లాస్‌మేట్స్‌.

తను క్రికెట్‌ చాలా బాగా ఆడతాడు. తను మెయిన్, నేను ఎక్స్‌ట్రా ప్లేయర్‌. ఇన్నిరోజుల తర్వాత మమ్మల్ని విధిరాత కలిపిందనుకుంటున్నా. తను చాలా టెర్రిఫిక్, మాస్‌ ప్రొడ్యూసర్‌. ఈ సినిమా క్లైమాక్స్‌ మ్యాచ్‌ 14రోజులు రాత్రుళ్లు మంచి చలిలో చిత్రీకరించాం. ఈ సినిమా చేస్తున్నప్పుడు క్రికెటర్ల కష్టం తెలిసింది. ఈ సినిమా ప్రాక్టీస్, షూటింగ్‌ వల్ల బరువు తగ్గాను. ఈ చిత్రాన్ని 20 సార్లు చూశా. సినిమా చూస్తున్నంత సేపు నన్ను నేను మరచిపోయా. ఇందులో నన్ను కాదు.. అర్జున్‌ పాత్రని మాత్రమే ప్రేక్షకులు చూస్తారు. గౌతమ్‌ వల్ల ఇండస్ట్రీకి మరో మంచి డైరెక్టర్‌ దొరికాడు’’ అన్నారు. నాగవంశీ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమాల్లో ఇదొక కొత్త జానర్‌ని క్రియేట్‌ చేస్తుంది. ఈ నెల 12న ట్రైలర్‌ రిలీజ్‌ చేసి, 15న ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహిస్తున్నాం. సినిమా ఈ నెల 19న విడుదల కాదని కొందరు మాట్లాడుతున్నారు. అనుకున్నట్లు 19నే కచ్చితంగా రిలీజ్‌ చేస్తున్నాం. ముందు తెలుగులో, ఆ తర్వాత చైనాలో విడుదల చేస్తాం’’  అన్నారు.  

మరిన్ని వార్తలు