ఇద్దరం తెలివైనవాళ్లమే!

22 Aug, 2018 02:11 IST|Sakshi

‘‘కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలపై దృష్టి పెట్టా. సినిమాల ఎంపికలో మరింత కేర్‌ తీసుకుంటున్నాను. ఇప్పుడు కమర్షియల్‌ సినిమాల్లో కూడా కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులకు నచ్చుతున్నాయి’’ అన్నారు నారా రోహిత్‌. పరుచూరి మురళి దర్శకత్వంలో నారా రోహిత్, జగపతిబాబు హీరోలుగా రూపొందిన చిత్రం ‘ఆటగాళ్ళు’. వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లమూడి జితేంద్రలు నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నారా రోహిత్‌ చెప్పిన విశేషాలు...

ఇందులో నేను డైరెక్టర్‌ పాత్ర, జగపతిబాబుగారు క్రిమినల్‌ లాయర్‌ పాత్ర చేశాం. ఇద్దరు తెలివైన వ్యక్తులు ఆడే మైండ్‌ గేమే ‘ఆటగాళ్ళు’. సినిమాలో ఇద్దరి వాయిస్‌లు స్ట్రాంగ్‌గా వినిపిస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రేక్షకులకు మరింత ఆసక్తి కలుగుతుంది. నా నటన బాగుంటుందా? లేక జగపతిబాబుగారి నటన బాగుంటుందా? అంటే అది నేను చెప్పలేను. ఆడియన్స్‌ డిసైడ్‌ చేస్తారు. ∙పరుచూరి మురళి అనగానే కమర్షియల్‌ సినిమా ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం. ఈ కథ చెప్పినప్పుడు ఇంకో కథ చెప్పమన్నా. కానీ ఆయన ఇది బాగుంటుంది.. నమ్మండి అన్నారు. ఓకే అన్నాను. ఇదే కథని నాకు ఇచ్చి చేయమంటే వేరేలా ఉంటుంది. మురళి స్టైల్‌ కమర్షియల్‌ టచ్‌ ఉంటుంది సినిమాలో. ∙ప్రొడక్షన్‌ చూసుకుంటూ డైరెక్షన్‌ చేయడం కష్టం. నా ప్రొడక్షన్‌లో ఒక్క బాలయ్యతోనే కాదు అందరి హీరోలతోనూ సినిమాలు చేయాలని ఉంది. మల్టీ లింగ్వల్‌ సినిమాల ప్లానింగ్‌ నాకూ ఉంది. ప్రస్తుతం ‘శబ్దం’ కాకుండా మరో రెండు సినిమాలు ఒప్పుకున్నాను.  

మరిన్ని వార్తలు