నాలుగు ప్రేమకథల సమ్మేళనం

16 May, 2015 16:58 IST|Sakshi
సుస్మితా సేన్

ముంబై: బెంగాలీ చిత్రం 'నిర్బాక్' హిందీలో రీమేక్ చేసే ఉద్దేశం తనకు లేదని వెండి తెరకు రీఎంట్రీ ఇచ్చిన మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ చెప్పారు. సుస్మితా సేన్ మాతృభాషలో నటించిన తొలి చిత్రం ఇది.  నాలుగు ప్రేమకథల సమ్మేళనంతో నిర్మించిన చిత్రం ఇది. నాలుగు ప్రేమ కథలు ఓ మహిళతో కనెక్ట్ అవుతాయి. చిత్రంలో ప్రాధాన్యతగల ఆ మహిళ పాత్రను సుస్మిత పోషించారు. బాలీవుడ్లోని తన మిత్రుల కోసం ఈ సినిమాను శుక్రవారం ఇక్కడ ప్రిమియర్ షో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ చిత్రం పూర్తిగా బెంగాలీ ఇతివృత్తంతో కూడుకున్నదన్నారు. నిర్బాక్ అంటే అర్ధం మూగ అని చెప్పారు.

ఈ మూవీలో అతి తక్కువ డైలాగ్స్ మాత్రమే ఉన్నాయని తెలిపారు. మనదేశంలోనే కాదు, ప్రపంచంలోని అందరికీ ఈ సినిమా అర్ధం అవుతుందన్నారు. ఏ భాషలోనూ రీమేక్ చేయవలసిన అవసరంలేదని చెప్పారు. మాతృ భాషలో ఒక్క సినిమాలోనైనా నటించాలన్నది  తన తండ్రి కోరిక అని ఆమె చెప్పారు. అందుకే ఈ సినిమాలో నటించినట్లు తెలిపారు.

 సుస్మితా సేన్ చివరిసారిగా 2010లో 'నో ప్రాబ్లం' చిత్రంలో నటించారు. ఇంతకాలం తరువాత మళ్లీ ఈ బెంగాలీ చిత్రంలో నటించారు. జాతీయ అవార్డు గ్రహీత సృజిత్ ముఖర్జీ దర్శకత్వంలో  ఈ సినిమాను 22 రోజుల్లోనే పూర్తి చేశారు.  మే 1న కోల్కతాలో విడుదలైన ఈ సినిమా దేశమంతటా శుక్రవారం విడుదలైంది.