ఎన్టీఆర్‌ ఫ్యామిలీని కలవను!

17 Oct, 2017 04:49 IST|Sakshi

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో అందరూ కొత్తవాళ్లే  

ఎన్టీఆర్‌ బయోపిక్‌ పేరుతో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వెండితెరపై ఏం చూపించబోతున్నారు? ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’తో ఆయన ఎవర్ని టార్గెట్‌ చేశారు? సాధారణ స్థాయి నుంచి తెలుగు ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిన నటుడిగా ఎదిగిన ఎన్టీఆర్‌ జీవితం, అక్కణ్ణుంచి సీయంగా ఎదిగిన పరిణామాలను కాకుండా... ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత ఘట్టాన్నే తీసుకోవడంలో వర్మ ఆంతర్యం ఏంటి? ఇటువంటి ప్రశ్నలకు సోమవారం ‘సాక్షి టీవీ’ లైవ్‌కి విచ్చేసిన వర్మ సమాధానాలు ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే....

స్నేహితులు, రచయితలతో మాటల సందర్భంలో ‘ఏపీలో ఎవరి లైఫ్‌పై బయోపిక్‌ తీస్తే బాగుంటుంది?’ అనడిగితే... ‘నో వన్‌ కెన్‌ బి బిగ్గర్‌ దేన్‌ ఎన్టీఆర్‌’ అన్నారు. అప్పుడు ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీయాలనుందని నేను ప్రకటించాను. ఐడియా వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌గారి లైఫ్‌ గురించి డీప్‌గా స్టడీ చేశా.

లక్ష్మీ పార్వతిగారిని నేను కలవలేదు. ఆమె ఎన్టీఆర్‌గారి జీవితంలోకి వచ్చిన టైమ్‌లో నేను బాంబేలో ఉన్నా. అసలు, ఎన్టీఆర్‌గారి లైఫ్‌లోకి లక్ష్మీ పార్వతిగారు వచ్చిన తర్వాత జరిగిన సంఘటలను నా సినిమాకి కథగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే...  ఎన్టీఆర్‌గారు సూపర్‌స్టార్, సూపర్‌ పొలిటీషియన్‌. ఓ గొప్ప వ్యక్తిగా ఉన్న ఆయన సడన్‌గా మామూలు మనిషిగా మారారు. ఆ టైమ్‌లో లక్ష్మీ పార్వతిగారు ఆయన లైఫ్‌లోకి ప్రవేశించారు. ఎన్టీఆర్‌గారు అలా కావడానికి, ఆ మానసిక స్థితిలోకి వెళ్లడానికి కారణమైన పరిస్థితులు ఏంటి? ఆ పరిస్థితుల్లోంచి ఏవేం జరిగాయి? ఎవరెవరు ఎంటరైతే ఎన్టీఆర్‌ ఎలా మారారు? మారిన వ్యక్తి గురించి ఎవరెవరు ఏమేం అనుకున్నారు? అనే అంశాలు నాకు ఆసక్తిగా అన్పించాయి.

కథ గురించి ఎవరెవర్ని కలిశాననేది కొన్ని కారణాల వల్ల చెప్పలేను. కానీ, ఎన్టీఆర్‌గారి ఫ్యామిలీని మాత్రం కలవలేదు. కలవను కూడా! ఎందుకంటే... ఎన్టీఆర్‌గారితో ఎమోషనల్‌ కాంటాక్ట్‌ ఉన్నవాళ్లకు వ్యక్తిగతంగానో, రాజకీయంగానో, మరో రకంగానో ఏవో ప్రయోజనాలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని తమ అభిప్రాయాల్ని చెబుతారు. అప్పుడు నేను నిజాన్ని తెలుసుకోలేను. ఎవరికైతే వ్యక్తిగత ప్రయోజనాలు లేవో... వాళ్లను కలిశా. రామారావుగారింట్లో పనిచేసిన డ్రైవర్‌ని కలిశా. పనివాళ్లనూ, ఒక వంట వ్యక్తిని కూడా కలిశా. వాళ్లకు ఏం తెలీదని మనమంతా అనుకుంటాం. కానీ, మన ఇంట్లో పనిచేసే వాళ్లకు మన గురించి తెలిసినంత మనకు కూడా తెలీదని నేను నమ్ముతా.

సినిమాలో నటీనటులుగా అందర్నీ కొత్తవాళ్లనే తీసుకుంటా. ఎన్టీఆర్‌ ఫ్యామిలీలో ఎవరెవరి రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌ సినిమాలో పాత్రలుగా ఉంటాయో... ఇప్పుడే చెప్పలేను.

మరిన్ని వార్తలు