రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

16 Jul, 2019 05:40 IST|Sakshi

‘‘15ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. 50 నుంచి 60 సినిమాలకు రచయితగా పనిచేశా. ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో ‘ఓ బేబీ’ చాలా సంతృప్తినిచ్చింది’’ అన్నారు రచయిత లక్ష్మీభూపాల్‌. ‘చందమామ, అలా మొదలైంది, నేనే రాజు నేనే మంత్రి, కల్యాణ వైభోగమే’ వంటి సినిమాలకు మాటలు రాశారాయన. రచయితగా తన జర్నీ గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘నేను యాక్సిడెంటల్‌ రైటర్‌ని. 1994 నుంచి టీవీ, మీడియా రంగంలో ఉన్నాను. 2004లో నటుడు లక్ష్మీపతిగారి ద్వారా మాటల రచయితగా మారాను.

కష్టాలన్నీ ముందే పడ్డాను.. అందుకే సినిమా ప్రయాణం సాఫీగా సాగినట్టుంది(నవ్వుతూ). ఫస్ట్‌ ‘సోగ్గాడు’ సినిమాకు మాటలు రాశాను. అప్పటినుంచి వరుసగా సినిమాలు రాస్తూనే ఉన్నాను. పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా రాయలేదు. కానీ, పెద్ద బ్యానర్లలో సినిమాలకు రాశాను. నేను అందరికీ ఓపెన్‌గానే ఉన్నాను. పెద్ద హీరోల సినిమాలు ఎందుకు రావడం లేదో నాకు తెలియదు. బహుశా పంచ్‌లు, ప్రాసలు రాయనని పిలవట్లేదేమో? ‘ఓ బేబీ’ సినిమా కోసం నేను ప్రత్యేకంగా రాసింది ఏం లేదు. అన్నీ దేవుడు రాయించారనుకుంటాను.

మా అమ్మమ్మ, అమ్మ మాట్లాడే మాటల్ని సినిమాలో పెట్టాను. ‘మగాడికి మొగుడులా బతికాను’ అనే మాట మా అమ్మమ్మ నోట్లో నుంచి చాలాసార్లు వచ్చింది. ఈ సినిమాని మా అమ్మమ్మ, అమ్మకు  అంకితం చేస్తున్నాను. సమంత, నందినీగార్లు ప్రతి ఫంక్షన్‌లో నా గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నందుకు థ్యాంక్స్‌. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న దారుణాలు చూసి ‘మొలతాడుకి మోకాలుకి మధ్య కొవ్వు ఎక్కువై కొట్టుకుంటున్నారు’ అనే డైలాగ్‌ రాశాను.   నేను చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం ఫెయిల్యూర్సే ఉన్నాయి.

కానీ, రైటర్‌గా నేనెప్పుడూ ఫెయిల్‌ అవ్వలేదు. అలా అయ్యుంటే రెండో సినిమా దగ్గరే వెళ్లిపోయేవాణ్ణి. సినిమా నాకు నచ్చితేనే చేస్తాను. నాకే నచ్చకపోతే ప్రేక్షకుడికి నచ్చేలా ఏం రాస్తాను? త్రివిక్రమ్‌గారి వల్ల రచయితలకు డబ్బు విలువ తెలిసింది.  రచయిత దర్శకుడిగా మారడానికి ఫ్రస్ట్రేషనో, రెమ్యూనరేషనో కారణం అవుతున్నాయి. దర్శకుడిగా మారే ఆలోచన ప్రస్తుతానికి నాకు లేదు. నా వద్ద ఓ 24 కథలు ఉన్నాయి. దర్శకుడిగా మారితే తీద్దాం అని ఆరు కథలు పక్కన పెట్టాను. నా తర్వాతి ప్రాజెక్టులు తేజ, నందినీ రెడ్డిగారు చేయబోయే సినిమాలే’’ అన్నారు.

మరిన్ని వార్తలు