సినిమా రివ్యూ: ఊహలు గుసగుసలాడే

21 Jun, 2014 14:05 IST|Sakshi
సినిమా రివ్యూ: ఊహలు గుసగుసలాడే
నటీనటులు: నాగశౌర్య, రాశి ఖన్నా, అవసరాల శ్రీనివాస్
నిర్మాత: రజని కొర్రపాటి
సంగీతం: కళ్యాణి మాళిక్
ఫోటోగ్రఫి: వెంకట్ సి. దిలీప్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అవసరాల శ్రీనివాస్
 
ప్లస్ పాయింట్స్: 
అవసరాల డైరెక్షన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
 
మైనస్ పాయింట్స్:
ఎడిటింగ్
కథ, కథనం
 
 
టాలీవుడ్ నటుడిగా సుపరిచితమైన శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా అవతారమెత్తి 'ఊహలు గుసగుసలాడే' చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 'వారాహి చలన చిత్రం' బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రం జూన్ 20 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఊహలు గుసగుసలాడే' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ ను సంపాదించుకుంది. అవసరాల దర్శకుడిగా సక్సెస్ సాధించారా అనే అంశాన్ని తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకోవాల్సిందే. 
 
టెలీ మార్కెటింగ్ యాడ్స్ కు యాంకర్ గా పనిచేసే ఎన్ వెంకటేశ్వరరావు అలియాస్ వెంకీ (నాగ శౌర్య) టెలివిజన్ న్యూస్ రీడర్ గా కావాలనే ఆశయంతో ఉంటాడు. అయితే తన బాస్ ఉదయ్ (అవసరాల శ్రీనివాస్) బిహేవియర్ తో టీవీ న్యూస్ రీడర్ కాలేకపోతాడు. అయితే పెళ్లి చూపుల్లో తనకు నచ్చిన ఓ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి వెంకీ సహకరిస్తే టీవీ న్యూస్ రీడర్ ను చేస్తానని ఉదయ్ ఒప్పుకుంటాడు. కాని గతంలో తను ప్రేమించి.. విడిపోయిన శ్రీసాయి శిరీష ప్రభావతి (రాశి ఖన్నా) అలియాస్ ప్రభావతియే తన బాస్ పెళ్లి చూపుల్లో చూసిందని తెలుసుకుంటాడు.  బాస్ ఇష్టపడిన తన ప్రేయసిని వెంకీ దక్కించుకున్నారా లేక ఉదయ్ పెళ్లి చేసుకున్నారా? వెంకీ, ప్రభావతి లు ఎందుకు విడిపోయారు? ఎన్నో ఉద్యోగాలు ఉన్నా.. వెంకీ టెలివిజన్ న్యూస్ రీడరే ఎందుకు కావాలనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'ఊహలు గుసగుసలాడే'.
 
వెంకీ పాత్ర నాగశౌర్యకు మరో మంచి అవకాశం. మధ్య తరగతి చలాకీ యువకుడిగా, ప్రేమికుడిగా డిఫరెంట్ షేడ్స్ లో కనిపించి మెప్పించాడు. కొన్ని సన్నివేశాల్లో శౌర్య ఎనర్జీ, ఫర్ ఫెక్ట్ ఈజ్ తో ఆకట్టుకున్నాడు. ప్రభావతిగా రాశి ఖానా తనకు లభించిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. గ్లామర్ తోనే కాకుండా యాక్టింగ్ తో రాశి ఖన్నా మెప్పించింది. ఇక టెలివిజన్ న్యూస్ చానెల్ యజమానిగా ఉదయ్ పాత్రలో అవసరాల శ్రీనివాస్ మరోసారి మంచి పాత్రలో కనిపించారు. వామనరావుగా టెలివిజన్ యాంకర్ గా పోసాని కృష్ణమురళి అక్కడక్కడ నవ్వించడమే కాకుండా చివరి సీన్ లో తనదైన ముద్రను ప్రేక్షకుల మదిలో వేసుకున్నాడు. 
 
కళ్యాణి మాళిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అయితే కళ్యాణ్ అందించిన పాటలు ఓహో అనిపించేంతగా లేవు. వెంకట్‌ సి. దిలీప్‌ అందించిన ఫోటోగ్రఫి ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఎడిటింగ్ పదను తగ్గడంతో చిత్ర కథనం నెమ్మదించడమే కాకుండా చోట్ల పేలవంగా అనిపిస్తుంది. ఎడిటింగ్ విషయంలో మరికొంత జాగ్రత్త వహించి ఉంటే మంచి ఫలితం రాబట్టుకునే అవకాశం ఉండేది. 
 
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వంతో వన్ మ్యాన్ ఆర్మీ పాత్రను పోషించిన అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా సఫలయయ్యారు. అయితే కొంత అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపించింది. రొటిన్ ప్రేమకథను.. స్లో నేరేషన్ తో 'బ్లూటూత్' ద్వారా ప్రేక్షకుడికి ఎక్కించాలనుకునే ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేకపోయిందనిపించింది. తాను చిత్రీకరించిన సన్నివేశాలపై మమకారం ఉన్న కారణంగానో ఏమో.. సినిమా నిడివిని పెంచేశాడు. మంచి డైలాగ్స్ అందించిన అవసరాల ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ద పెట్టాల్సి ఉంటే బాగుండేది.  ప్రేమకథకు ఆకట్టుకునే పాటలు లేకపోవడం ఓ లోపంగా చెప్పవచ్చు. వెంకీ, ప్రభావతి, ఉదయ్ పాత్రల డిజైన్ లో ఫర్ ఫెక్షన్ సాధించినా.. ఓవరాల్ గా ఓ మంచి ఫీల్ తో కూడిన ప్యాకేజిని అందించడంలో తడబాటుకు గురయ్యాడనిపించింది.  నటుడిగానూ కాకుండా దర్శకుడిగా కూడా అవసరాల సక్సెసైనా... 'ఊహలు గుసగుసలాడే'ను కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకోవడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. 
 
ట్యాగ్ లైన్: ఊహలు రుసరుసలాడే