ఆఖరి పోరాటంలో ఆస్కారం ఎవరికో?

16 Jan, 2015 23:49 IST|Sakshi
ఆఖరి పోరాటంలో ఆస్కారం ఎవరికో?

ప్రపంచ సినిమాకు సంబంధించి అత్యధికంగా అందరి దృష్టినీ ఆకర్షించేది - ఆస్కార్ అవార్డులు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ అవార్డును అందుకోవడం చాలా మందికి ఒక కల. కానీ, ఈ ప్రతిమను సొంతం చేసుకోవడం అంత సులభం కాదు. గట్టి పోటీ ఉంటుంది. ముందు ఆస్కార్‌కు నామినేషన్లలో స్థానం దక్కించుకోవాలి. దానికే పెద్ద పోటీ ఉంటుంది. ఆ తుది నామినేషన్లలో స్థానం దక్కితే.. ఆస్కార్ అవార్డ్ పోటీ వరకు వెళ్లొచ్చు.

ఆఖరి పోరాటంలో ఆస్కార్ ఎవరికి దక్కితే వారికి బోల్డంత ఆనందం. ఇక, ఈసారి ఆస్కార్ బరిలో నిలవబోయే చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల జాబితాను అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో గురువారం ప్రకటించారు. ఎక్కువ శాతం విభాగాల్లో ‘బర్డ్ మ్యాన్’, ‘ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్’ చిత్రాలు నామినేషన్లను దక్కించుకోవడం విశేషం.
 
రహమాన్‌కు దక్కనిచోటు
గతంలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రానికి జంట ఆస్కార్ అవార్డులు అందుకుని, ప్రపంచవ్యాప్తంగా భారతీయులు గర్వపడేలా చేశారు సంగీత దర్శకుడు ఎ.ఆర్. రహమాన్. కాగా, ఈ 87వ ఆస్కార్ అవార్డ్స్‌లో మరోసారి రహమాన్ తన సత్తా చాటుతారని చాలామంది ఆశపడ్డారు. దానికి కారణం ఏమిటంటే, రహమాన్ సంగీత సారథ్యం వహించిన విదేశీ చిత్రాలు ‘మిలియన్ డాలర్ ఆర్మ్’, ‘హండ్రెడ్ ఫుట్ జర్నీ’, భారతీయ చిత్రం ‘కొచ్చడయాన్’లు బెస్ట్ ఒరిజినల్ స్కోర్  విభాగంలో ఈసారి ఎంట్రీలుగా వచ్చాయి.

కానీ, ఈ విభాగంలో తుది నామినేషన్ల జాబితాలో వీటికి స్థానం దక్కలేదు. దాంతో ‘బెటర్ లక్ నెక్ట్స్ టైమ్’ అని రహమాన్ అభిమానులు అనుకుంటున్నారు. రహమాన్ మాత్రమే కాదు... ‘ఒరిజినల్ స్కోర్’ విభాగంలో హిందీ చిత్రం ‘జల్’కి సంగీత సారథ్యం వహించిన సోనూ నిగమ్, బిక్రమ్ ఘోష్ కూడా నామినేషన్ ఎంట్రీకి పోటీపడ్డారు. కానీ, వాళ్లకూ చుక్కెదురైంది.
 
మన చిత్రాలు లేవు!  
ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ దక్కించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా 323 చిత్రాలు బరిలోకి వచ్చాయి. మన దేశం నుంచి అధికారిక ఎంట్రీగా ‘లయర్స్ డైస్’ సినిమా వెళ్ళింది. కానీ, మలయాళ నటి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ‘లయర్స్ డైస్’ తొలి వడపోతలోనే ఇంటి ముఖం పట్టేసింది. చివరకు ఇప్పుడు అయిదే అయిదు చిత్రాలు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో తుది నామినేషన్ల జాబితాలో స్థానం దక్కించుకున్నాయి. అవి - పోలండ్‌కి చెందిన ‘ఇడా’, రష్యన్ మూవీ ‘లెవియాథన్’, ఎస్తోనియాకు చెందిన ‘టాంజెరైన్స్’, మరిటానియా దేశ చిత్రం ‘టింబక్టూ’, అర్జెంటేనియా చిత్రం ‘వైల్డ్ టేల్స్’.
 
ఫిబ్రవరి 22న ఫలితాలు
ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్‌కి చెందిన 6 వేల పైచిలుకు మంది సభ్యులు తమకు నచ్చిన చిత్రాలు, కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఓటు వేస్తారు. మొత్తం 17 శాఖలుగా సభ్యులను విభజిస్తారు. ఏ శాఖకు చెందిన సభ్యులు ఆ శాఖలో ఉన్న పోటీదారులకు ఓట్లు వేస్తారు. ఈ ఓట్లను పరిగణనలోకి తీసుకొని, విజేతను ఎంపిక చేస్తారు. వచ్చే నెల 6న ఉదయం 8 గంటలకు (అమెరికా టైమింగ్) ఓటింగ్ మొదలవుతుంది. 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ముగుస్తుంది. ఫిబ్రవరి, 22న అవార్డుల ప్రదానం జరుగుతుంది. ఈసారి ఆస్కార్ అందుకొనే అదృష్టవంతులెవరో తెలుసుకోవడానికి అంత దాకా ఆగాల్సిందే!
 
ఇక బరిలో మిగిలింది...
ఉత్తమ చిత్రం: బాయ్ హుడ్, ది గ్రాండ్ బుడాపెస్ట్ హోటల్, అమెరికన్ స్నైపర్, బర్డ్ మ్యాన్, సెల్మా, ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్, ది ఇమిటేషన్ గేమ్, విప్‌ల్యాష్, ఉత్తమ నటుడు: మైఖేల్ కీటన్, ఎడ్డీ రెడ్‌మేన్, బెండిక్ట్ కంబర్‌బ్యాచ్, బ్రాడ్లీ కూపర్, స్టీవ్ కారెల్ ఉత్తమ నటి: జూలియన్ మూర్, ఫెలిసిటీ జోన్స్, మారియన్ కోటిల్లార్డ్, రోజమండ్ పైక్, రీస్ విదర్‌స్పూన్ ఉత్తమ దర్శకుడు: రిచర్డ్ లింక్‌లేటర్, వెస్ ఆండర్సన్, బెన్నెట్ మిల్లర్, మార్టెన్ టిల్‌డమ్,
 అలెజాండ్రో గొంజాలెజ్ ఇనారిటు