అల్లు సూర్యతో...!

22 Jun, 2017 00:21 IST|Sakshi
అల్లు సూర్యతో...!

ఎవరీ అల్లు సూర్య? అల్లు అర్జున్‌ తెలుసు. అతని తమ్ముడు, హీరో అల్లు శిరీష్‌ తెలుసు. వీళ్లిద్దరి తండ్రి, నిర్మాత అల్లు అరవింద్‌ తెలుసు. మరి, ఈ అల్లు సూర్య ఎవరు? కొత్త హీరోనా? అంటే... కాదు, స్టార్‌ హీరోనే! అల్లు అర్జునే. ఆయన ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ అంటున్నారు కదా! అందుకే, అల్లు సూర్య అంటున్నాం! ఈయన పక్కన పవన్‌కల్యాణ్‌ హీరోయిన్‌ నటిస్తున్నారని టాక్‌.

ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ అనూ ఇమ్మాన్యుయేల్‌ ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈమెను ‘నా పేరు సూర్య...’లో అల్లు అర్జున్‌కు జోడీగా ఎంపిక చేశారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. కన్నడ ‘కిరిక్‌ పార్టీ’ ఫేమ్‌ రష్మిక మండనతో పాటు పలువురు ఈ సినిమా కోసం ఫొటోషూట్స్‌ చేశారు. చివరకు, అనూను ఫైనలైజ్‌ చేశారట. ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు అనూ ఇమ్మాన్యుయేల్‌ పరిచయమే. ‘మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాల్లో నటించారీమె. రచయిత వక్కంతం వంశీను దర్శకుడిగా పరిచయం చేస్తూ లగడపాటి శ్రీధర్, కె. నాగబాబు, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది.