ప్రమాదంలో గాయపడ్డ పవన్ కొడుకు

9 May, 2016 12:59 IST|Sakshi
ప్రమాదంలో గాయపడ్డ పవన్ కొడుకు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్ ప్రమాదంలో గాయపడ్డాడు. అకీరా సైకిల్పై నుంచి పడటంతో గాయాలయ్యాయి. రేణు దేశాయ్ వెంటనే అకీరాను ఓ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అది పేరున్న ఆస్పత్రి అయినా అకీరాకు చికిత్స చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చూపారు. అతనికి ఆలస్యంగా చికిత్స చేశారు. సోమవారం రేణు ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్లో తెలియజేసింది. వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

'అకీరా సైకిల్ ప్రమాదంలో గాయపడ్డాడు. వెంటనే అతడ్ని పేరున్న ఆస్పత్రికి తీసుకెళ్లాను. గాయపడిన చిన్న పిల్లాడికి వైద్యం చేయకుండా వైద్యులు ఆలస్యం చేశారు. బాధతో ఎదురు చూడాల్సివచ్చింది. చికిత్స కోసం పెద్ద ఆస్పత్రులకు వెళ్లడం కంటే చనిపోవడం నయం. డాక్టర్ల నుంచి నర్సుల వరకు మొత్తం వ్యవస్థ నిర్లక్ష్యం మానవత్వాన్ని చంపేస్తోంది' అని రేణు ట్వీట్ చేసింది. కాగా అకీరాకు ప్రమాదం ఎప్పుడు జరిగింది, తీసుకెళ్లిన ఆస్పత్రి పేరు, ఊరు వంటి విషయాలను రేణు వెల్లడించలేదు. ప్రస్తుతం అకీరా కోలుకుంటున్నాడు.

అకీరా చేతికి ఫ్రాక్చర్ అయినట్టు రేణు కాసేపటి తర్వాత మరో ట్వీట్ చేసింది. అకీరా ముఖం, భుజం, మోకాలు, మేచేతిపై గాయాలయినట్టు వెల్లడించింది. అకీరా ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడని, అతను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది.

సామాన్యులకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఆస్పత్రికి వెళితే బిల్లు తడిసి మోపెడవుతుంది. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తాయి కానీ సర్వీసు ఆ స్థాయిలో ఉండదన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కోసారి సెలెబ్రెటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. రేణు దేశాయ్ కూడా బాధితురాలే. పవన్తో విడిపోయాక రేణు తన ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యలతో కలసి పుణెలో ఉంటోంది.