టీడీపీకి కొత్త టెన్షన్‌.. బెడిసికొట్టిన ‘బాబు’ ప్లాన్‌!

19 Nov, 2023 11:41 IST|Sakshi

పెళ్లికి ముందే దంపతులు కొట్టుకుంటోన్నట్లుంది టీడీపీ-జనసేనల వ్యవహారం. దేశ రాజకీయ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా  ఎన్నికలకు చాలా నెలల ముందే టీడీపీ-జనసేన పొత్తు పెట్టేసుకున్నాయి. కలిసి వెళ్తామని చెప్పుకొచ్చాయి. అయితే క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల నేతల మధ్య ఏ మాత్రం సయోధ్య లేదు. ఆ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశాలు చాలా చోట్ల  రెండు పార్టీల నేతల మధ్య ఘర్షణలకు దారి తీస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఈ పొత్తుతో ఎన్నికల ఏరు ఎలా దాటుతారో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు..

ఇటీవల కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం లో జరిగిన టీడీపీ-జనసేన పార్టీల సమన్వయ సమావేశం రచ్చ రచ్చయింది. ఇరుపార్టీల నేతల మధ్య సాగిన మాటల యుద్దం ఉద్రిక్త పరిస్ధితులకు దారి తీసింది. దీంతో ఇక ఇక్కడ భవిష్యత్తులో టీడీపీ-జనసేన కలిసి ముందుకు వెళ్ళే పరిస్ధితి లేదన్న విషయం నియోజకవర్గ ప్రజలకు అర్ధమైంది. ఇక అసలు విషయానికి వస్తే పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులు ఏర్పడ్డాయి. ఇందుకు కారణం గత కొన్ని రోజులుగా టీడీపీకి చెందిన నేతలు, కార్యకర్తలను జనసేన పార్టీలో చేర్చుకుంటున్నారు ఉదయ్ శ్రీనివాస్. ఇది మాజీ ఎమ్మెల్యే వర్మకు నచ్చలేదు. 

టీడీపీకి షాక్‌..
రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళాల్సిన తరుణంలో బయట పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలను చేర్చుకోవాల్సింది పోయి తన కేడర్‌ను చేర్చుకోవడం ఏమిటని శ్రీనివాస్‌పై రగిలిపోతున్నారు వర్మ. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రిందట పిఠాపురంలోని పాత టీడీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం-జనసేన పార్టీల సమన్వయ కమీటీ సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశంలో జనసేన కో-ఆర్డినేటర్ ఉదయ్ శ్రీనివాస్ చేసిన వాఖ్యలు వర్మకు పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది. వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని శ్రీనివాస్ కోరారు. గత ఎన్నికల్లో వర్మ ఓటమి చెందిన కారణంగా తనకు ఈ అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

ఇలా శ్రీనివాస్ చేసిన వాఖ్యలు వర్మకు మంట పుట్టించాయి. దీంతో వర్మ మైక్ పట్టుకుని చాలా కూల్‌గా శ్రీనివాస్‌కు కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయింది వాస్తవమే అని.. తనతో పాటుగా ఆ ఎన్నికల్లో‌ మహామహులు కూడా ఓడిపోయారంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తనదైన శైలిలో విమర్శలు చేశారు. దీంతో వర్మ వాఖ్యలు రుచించని జనసేన నాయకులు ఆక్రోశంతో రగిలిపోయారు. జై జనసేన అంటూ టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమావేశం కోసం వేసిన కుర్చీలు, టేబుళ్ళలను తన్నేశారు. 2014 ఎన్నికల్లో నువ్వు ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలో ఉంటే మేము గెలిపించిన సంగతి మరచిపోవద్దంటూ వర్మకు సూటిగా సమాధానం ఇచ్చారు జనసేన నాయకులు.

ఇలా జనసేన-టీడీపీ నేతల మధ్య కాసేపు దూషణలు జరగడంతో ఆ పార్టీలో నేతల మధ్య ఉన్న విభేధాలు బయట పడ్డాయి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలకు టీడీపీ తనకు సీటు ఇవ్వని పక్షంలో 2014 మాదిరిగా మళ్లీ స్వతంత్ర అభ్యర్ధిగా వర్మ బరిలో నిలవాలని ఫిక్స్ అయ్యారటా. దీంతో పిఠాపురంలో టీడీపీ-జనసేన పొత్తు ఉండకపోవచ్చన్న భావన నియోజకవర్గ ప్రజల్లో పాతుకుపోయింది.

మరిన్ని వార్తలు