రాహుల్‌ పిచ్చివాడిలా చేస్తున్నాడు!

3 Apr, 2016 16:43 IST|Sakshi
రాహుల్‌ పిచ్చివాడిలా చేస్తున్నాడు!

ప్రముఖ టీవీ నటి ప్రత్యుష బెనర్జీ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు రాహుల్‌ రాజ్ సింగ్ ఆస్పత్రి పాలయ్యాడు. రాహుల్‌ తీవ్ర ఒత్తిడి, కుంగుబాటుతో సతమవుతున్నాడని, ఛాతినొప్పి రావడంతో అతన్ని ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్చామని రాహుల్ తరఫు లాయర్‌ నీరజ్ గుప్తా తెలిపారు.

రాహుల్‌ ఆదివారం పోలీసు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరడంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లలేదు. మరోవైపు అతన్ని ఆస్పత్రిలో చేర్చిన అతని స్నేహితురాలు శైలా చద్దా మాట్లాడుతూ.. రాహుల్‌ దాదాపు పిచ్చివాడిగా మారిపోయాడని, అందుకే కుటుంబసభ్యులు అతన్ని ఆస్పత్రిలో చేర్చారని తెలిపింది. 'అతను తీవ్ర వేదనలో ఉన్నాడు. దిగ్భ్రాంతికి లోనయ్యాడా? లేక పిచ్చివాడు అవుతున్నాడా? తెలియడం లేదు. అతనికి ఏమైనా జరిగే అవకాశముంది. అందుకే మేం అతన్ని ఆస్పత్రిలో చేర్చాం' అని ఆమె తెలిపింది.

'ప్రపంచం అతనికి వ్యతిరేకంగా ఉండవచ్చు. కానీ నాకు మాత్రం అతనిది ఏ తప్పు లేదని అనిపిస్తోంది. ఘటన జరిగిన నాటి నుంచి అతను ఏడుస్తూనే ఉన్నాడు. నేను స్వయంగా చూశాను' అని ఆమె చెప్పింది. ప్రత్యుష బెనర్జీ అనుమానాస్పద ఆత్మహత్య వ్యవహారంలో ప్రధానంగా రాహుల్‌పైనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడు ఆమెను కొట్టేవాడని, వారిద్దరి మధ్య గతకొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ముంబై పోలీసులు రాహుల్‌ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే.