‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

16 Jul, 2019 16:01 IST|Sakshi

ఒక్క సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియ ప్రకాష్ వారియర్‌. తొలి సినిమా ఒరు ఆదార్‌ లవ్‌ రిలీజ్‌కు ముందే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ప్రియా ఆ సినిమా ఫ్లాప్‌ అయినా తనపై వచ్చిన  క్రేజ్‌ను మాత్రం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ భామ ఓ వివాదాస్పద చిత్రంలో నటిస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు.

ప్రియా ప్రకాష్‌ నటిస్తున్న తాజా చిత్ర ‘శ్రీదేవి బంగ్లా’. ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయిన దగ్గర నుంచే వివాదం మొదలైంది. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ శ్రీదేవి అనే నటి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఆమె పాత్రకు బాత్‌టబ్‌లు మునిగి చనిపోయినట్టుగా చూపించటంతో శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ చిత్రయూనిట్‌కు నోటీసులు పంపారు.

అయితే ఈ వివాదంపై స్పందించిన నటి ప్రియా ప్రకాష్, ఈ వివాదాలన్నీ చిన్న విషయాలంటూ కొట్టి పారేశారు. నటిగా నా పాత్రకు న్యాయం చేయటం వరకే నా బాద్యత, వివాదాలు వస్తే దర్శక నిర్మాతలు చూసుకుంటారు. ఎవరినీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఆరాత్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ దర్శకుడు.

మరిన్ని వార్తలు