'మా' అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్

17 Apr, 2015 12:54 IST|Sakshi
'మా' అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్

ఆసక్తికరంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో నటుడు రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. తనపై పోటీ చేసిన జయసుధ మీద ఆయన 85 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మార్చి 29వ తేదీన జరిగిన మా ఎన్నికల్లో మొత్తం 702 మంది సభ్యులకు గాను 394 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరోరౌండు పూర్తయ్యే సరికే ఆయన స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. చివరకు ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన జయసుధ మీద 85 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో రాజేంద్రప్రసాద్ అభిమానులు, ఆయన వర్గీయులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

ఈ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ ప్రతి రౌండులోనూ ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ప్రధానంగా మురళీమోహన్ మీద వ్యతిరేకత కారణంగానే రాజేంద్రప్రసాద్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఎక్కువ కాలం పాటు మా అధ్యక్ష పదవిని మురళీమోహన్ అనుభవించారు. ఆయన చేతిలో గతంలో రాజేంద్రప్రసాద్ ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఈ సారి ఎన్నికల సందర్భంగా భారీ స్థాయిలో వాద ప్రతివాదాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు కనిపించాయి. రెండు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలంటూ నటుడు, నిర్మాత ఓ. కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మార్చి 29న ఎన్నికలు జరిగాయి. తర్వాత ఫలితాల విడుదలకు కూడా కోర్టు ఆమోదం తెలిపింది. దాంతో శుక్రవారం నాడు ఏడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది.