రవితేజ ‘నేల టిక్కెట్టు’ కన్ఫామ్!

17 Mar, 2018 19:43 IST|Sakshi
నేల టిక్కెట్టు ఫస్ట్‌ లుక్‌

సాక్షి, సినిమా: రాజా ది గ్రేట్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మాస్‌ మహారాజ్‌ రవితేజ తరువాత టచ్‌చేసి చూడు సినిమాతో తడబడ్డాడు. ప్రస్తుతం ఈ ఎనర్జిటిక్‌ స్టార్‌ 'నేల టిక్కెట్టు‌' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సంవత్సరాది ఉగాదికి కొత్త కొత్తగా కనిపించి అభిమానులకు పండగ ఉత్సాహాన్ని డబుల్‌ చేయనున్నారు హీరో రవితేజ. తన అభిమానులకు ఉగాది కానుకగా నేల టిక్కెట్టు మూవీ ఫస్ట్ లుక్‌ను శనివారం సోషల్ మీడియాలో రవితేజ విడుదల చేశారు. పల్లెటూరి బ్రాక్‌డ్రాప్ తో ఈ ఫొటోలో హీరో రవితేజతో పాటు ఆయన చుట్టూ ఉన్న వారి చేతుల్లోనూ చాయ్ గ్లాస్‌తో సరదాగా ఉన్నారు. 

‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్‌ వేడుక చూద్దాం’  ఫేమ్‌ కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మాతగా ఈ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మాళవిక శర్మ, రవితేజతో జోడీగా కనిపించనున్నారు. శక్తికాంత్‌ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ‘నేల టిక్కెట్టు‌’ అనే టైటిల్‌ను అనుకున్నా.. అధికారికంగా ఉగాది కానుకగా ఓ రోజు ముందు టైటిల్‌తో పాటు ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. కాగా, సినిమాకు సంబందించిన డిజిటల్‌, శాటిలైట్‌, హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ను ఓ ప్రముఖ టీవీ ఛానల్‌ 25 కోట్లకు సొంతం చేసుకుంది. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాను మే 24న విడుదల చేయనున్నారు.

మరిన్ని వార్తలు