వజ్రానికి కవచంలా...

17 Apr, 2019 00:01 IST|Sakshi

‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ చిత్రాల తర్వాత సప్తగిరి హీరోగా నటించిన చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. వైభవీ జోషీ కథానాయికగా నటించారు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ ఫేమ్‌ అరుణ్‌ పవార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బేబీ శస్త్ర సమర్పణలో శివ శివమ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా టీజర్, ప్రత్యేక పాటను హైదరాబాద్‌లో విడుదల చేసారు. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ– ‘‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బి’ చిత్రాల తర్వాత నన్ను నేను కొత్తగా ఎలా చూపించుకోగలను అని ఎదురుచూస్తున్న సమయంలో అరుణ్‌ పవార్‌ ఈ కథ చెప్పారు. ‘లక్ష్యం గొప్పదైనా వెళ్లే మార్గం మంచిది అయితేనే ఆ దేవుడి సహకారం ఉంటుంది’ అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నేను హీరోగా కాకుండా మంచి కమెడియన్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తాను. ఎమోషనల్‌ కంటెంట్‌ కూడా ఉంది. సినిమాని మేలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

అరుణ్‌ పవార్‌ మాట్లాడుతూ– ‘‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌’ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అప్పుడు నోట్ల రద్దు ఉన్నా కూడా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలు చూశారు. అంతకంటే మంచి పేరు, డబ్బులు రావాలనే కసితో ‘వజ్ర కవచధర గోవింద’ సినిమా తెరకెక్కించాం. సినిమా చాలా బాగా వచ్చింది. వజ్రం కోసం సప్తగిరి ఎలా కవచంలా నిలబడ్డాడు అనేది కథ’’ అన్నారు. ‘‘టైటిల్‌ ప్రకటించగానే మా సినిమాపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అటెన్షన్‌ బాగా పెరిగింది. నరేంద్ర అన్నగారు ఈ సినిమాకు ఎంతో సహకారం అందించారు. మా సినిమా టీజర్‌ చూసి ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేసేందుకు ముందుకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ బ్రహ్మయ్యగారికి నా కృతజ్ఞతలు’’ అన్నారు జీవీఎన్‌ రెడ్డి. నటుడు రాఘవ, సినిమాటోగ్రాఫర్‌ ప్రవీణ్‌ వనమాలి, డిస్ట్రిబ్యూటర్‌ బ్రహ్మయ్య, సంగీత దర్శకుడు విజయ్‌ బుల్గానిన్, ఎడిటర్‌ కిషోర్‌ మద్దాలి మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సలాన బాలగోపాలరావు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు