మరో వారసురాలు వస్తోంది..

13 Dec, 2016 11:11 IST|Sakshi
మరో వారసురాలు వస్తోంది..

ముంబై: బాలీవుడ్‌, దక్షిణాది హీరోల కుమార్తెలు చాలా మంది నటనను వారసత్వంగా తీసుకుని వెండితెరపై వెలిగిపోతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో వారసురాలు వస్తోంది. బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌, అమృతా సింగ్‌ల కుమార్తె సారా అలీఖాన్‌ (24) తెరంగేట్రం చేయనుంది. రణవీర్ సింగ్ హీరోగా జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాతో సారా హీరోయిన్గా నటించనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ఏంటంటే.. సారా తొలి చిత్రంలో రణవీర్‌ సింగ్‌ సరసన గాక కరణ్‌ మల్హోత్రా దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌తో కలసి నటించనుంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇంతకుముందు కూడా కరణ్‌ జోహార్‌ సినిమాలో సారా నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే కరణ్‌తో తన తల్లి అమృతకు విభేదాలు ఉన్న కారణంగా సారా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. ఈ నేపథ్యంలో సారా తెరంగేట్రం చేయడం ఖాయమైనా ఏ ప్రాజెక్టులో తొలుత నటిస్తుందన్న విషయంపై క్లారిటీ రావాల్సి వుంది.