తలైవా బర్త్‌డే నేడు! ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌?

12 Dec, 2023 06:52 IST|Sakshi

తమిళ సినిమా: రజనీకాంత్‌ ఈ పేరే ఒక ప్రభంజనం. అశేష ప్రేక్షకుల గుండెల్లో కొలువైన పేరు. శివాజీ రావు గైక్వాడ్‌ అనే ఒక సాధారణ బస్‌ కండక్టర్‌ను దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్‌ 1975లో రజనీకాంత్‌గా మార్చి నటుడిగా పునర్‌ఃజన్మను ఇచ్చారు. అలా అపూర్వ రాగంగల్‌ చిత్రంతో ప్రతి నాయకుడిగా మెరిసిన రజనీకాంత్‌ ఆ తర్వాత కథానాయకుడిగా అవతారం ఎత్తి తనకు తానుగా ఎదుగుతూ ఇప్పుడు ఎవర్‌ గ్రీన్‌ సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్నారు. మధ్యలో రాజకీయాల వైపు మొగ్గు చూపినా, ఆ తర్వాత అది తన స్వభావానికి సరిపడదని భావించి అభిమానులను అలరించడమే తన సరైన రూటు అని నటనపైనే పూర్తిగా శ్రద్ధ పెట్టారు.

రజనీకాంత్‌ ఇటీవల నటించిన చిత్రాలు ఫ్లాప్‌ కావడంతో ఆయన పని అయిపోయిందని.. ఇక నటన నుంచి స్వచ్ఛందంగా వైదొలగడం మంచిదనే మాటలు వినిపించాయి. అలాంటి వాటికి రజనీకాంత్‌ జైలర్‌ చిత్రంతో గట్టిగా బదులిచ్చారు. ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్‌ సలామ్‌ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తిచేసిన రజినీకాంత్‌ తన 170వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి జై భీమ్‌ చిత్రం ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ కథ దర్శకత్వం బాధితులను నిర్వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. నేడు (డిసెంబర్‌ 12) రజనీకాంత్‌ 73వ పుట్టినరోజు. ఈ స్టైల్‌ కింగ్‌ పుట్టిన రోజు అంటే అభిమానులకు పండుగ రోజు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వారందరూ రజనీకాంత్‌ పుట్టిన రోజు పండుగను ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈ పుట్టినరోజు సందర్భంగా రజనీకాంత్‌ ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలకు సంబంధించిన కొత్త విషయాలను ప్రకటిస్తారా? లేక తన 171వ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తారా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

A post shared by Sun Pictures (@sunpictures)

>
మరిన్ని వార్తలు