ఆ స్థితికి సిగ్గు పడుతున్నా..

3 Jan, 2016 08:52 IST|Sakshi
ఆ స్థితికి సిగ్గు పడుతున్నా..

  ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూలో నటి ఊర్వశి శారద ఆవేదన
 
ఊర్వశి శారద సినీ రంగంలో ఓ ట్రెండ్ సెట్టర్. దాదాపు 350కిపైగా సినిమాలు, 60ఏళ్ల సినీ ప్రస్థానం, విభిన్నమైన పాత్రలు. మూడుసార్లు జాతీయ ఉత్తమనటిగా అవార్డు సొంతం చేసుకున్నారు. స్వతహాగా తెలుగునటి అయిన శారదను మలయాళ పరిశ్రమ అక్కున చేర్చుకుంది. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయాలు సాధించిన శారద ఆర్షవికాస పరిషత్ సంస్థ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు..    
 
 
సాక్షి : సరస్వతి అయిన మీరు శారదగా ఎలా మారారు?
శారద  : సినిమా రంగంలో అప్పటికే ఇద్దరు సరస్వతులు ఉన్నారు. అందువల్ల శారదగా మారాల్సి వచ్చింది.
 

సాక్షి :  సీనియర్ నటిగా మీకు రావాల్సిన అవార్డులు రాలేదంటారు. నిజమేనా?
శారద  : ప్రేక్షకుల అభిమానాన్ని మించిన అవార్డు లేదు కదా..


సాక్షి :  మీరు తెలుగువారైనా మీలోని ప్రతిభను గుర్తించినవారు మలయాళీలు కదా?
శారద  : మలయాళీలు స్నేహప్రియులు. వారు ఇప్పటికీ నన్ను అమ్మ, అక్క అనే పిలుస్తారు.

సాక్షి : నేటి సినిమాలను చూస్తే మీకేమనిపిస్తుంది?
శారద: చాలా సందర్భాల్లో సిగ్గుపడుతుంటాను. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలు లేవు. హీరోకు పూర్తి డ్రస్సులు.. హీరోయిన్లకు పీలికలు.


సాక్షి : నేటి సినిమాల్లో మెలోడీలకు స్థానం లేదన్న దానిపై మీ కామెంట్
శారద  : నిజమే. నేటి సినీ సాహిత్యం చాలా సందర్భాల్లో గుర్తుకురావడమే లేదు.

సాక్షి : శారద సినీనటి కాకుంటే ఏమయ్యేవారు?
శారద  : ప్రశ్నే లేదు. శారద సినిమాల కోసమే పుట్టింది. శారద ఊపిరి సినిమానే..

సాక్షి : మీరు గర్వపడే సందర్భం..
శారద  : ఒకే సినిమా పలు భాషల్లో నటించినప్పుడు అన్ని భాషల్లోనూ ప్రధాన పాత్ర పోషించడం

సాక్షి : ఎన్టీఆర్ అవార్డు గురించి చెప్పండి
శారద  : నా జీవితంలో మరిచిపోలేని సంఘటన  ఎన్టీఆర్ అవార్డు అందుకోవడమే. ఎన్టీఆర్ మహానటుడు. ప్రతిభను గుర్తించడం ఆయన నైజం.


సాక్షి : ఐదు భాషల్లో నటించిన మీకు ఏ భాష సౌకర్యంగా ఉంటుంది?
శారద  : భాషా భేదమేమీ లేదు. ఏ భాషలోనైనా ప్రతిభ ఆధారంగానే అవకాశం దక్కింది.
 

సాక్షి : నటిగా మీరు పొందిన అనుభూతి?
శారద  : అభిమానులు నన్ను అన్ని సంద ర్భాల్లోనూ తోబుట్టువుగా భావించారు. ‘సాక్షి’ తొలినుంచి నన్ను అభిమానిస్తూనే ఉంది. టీమ్ మొత్తానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.