సెల్వకుమార్‌ చేతికి పొదునలన్‌కరుది

4 Feb, 2019 09:24 IST|Sakshi

తమిళసినిమా: పులి చిత్ర నిర్మాత పీటీ.సెల్వకుమార్‌ చేతికి పొదునలన్‌కరుది చేరింది. ఇంతకుముందు ఇరుంబుతిరై వంటి విజయవంతమైన చిత్రాన్ని విడుదల చేసిన పీటీ.సెల్వకుమార్‌ తాజాగా ఈ పొదునలన్‌కరుది చిత్రాన్ని తమిళనాడు వ్యాప్తంగా ఈ నెల 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆయన చిత్రం గురించి తెలుపుతూ తమిళనాడులో లెక్కలు తెలియకుండా, ఎవరూ పట్టించుకోని విధంగా కందువడ్డీ వృత్తి ఎలా సాగుతోంది? సాధారణ ప్రజలు దానికి ఎలా బలైపోతున్నారు? అని చెప్పే చిత్రంగా పొదునలన్‌కరుది ఉంటుందన్నారు. రూ.5 వేలకు ఆశపడి రూ.50 వేల వరకూ తిరిగి చెల్లించే పేద, మధ్య తరగతి ప్రజలు ఎదుర్కొనే సమస్యలను నవ దర్శకుడు సీయోన్‌ కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించారని అన్నారు.

ఆ మధ్య నెల్‌లైలో కందువడ్డీ బారిన పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని, అదేవిధంగా కుమారుడి చదువు కోసం వడ్డీకి తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేక తిరుచ్చికి చెందిన ఒక రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడని అన్నారు. ఇలాంటి సంఘటనలను ఆవిష్కరించే చిత్రంగా పొదునలన్‌కరుది చిత్రం ఉంటుందని చెప్పారు. అలా వడ్డీ మాఫియా అమాయకులను మానసికంగా ఎలా బాధిస్తున్నారన్నది కొత్త కోణంలో అవిష్కరించిన చిత్రం పొదునలన్‌కరుది అని చెప్పారు. నటుడు కరుణాకరన్, సంతోష్, అరుణ్‌ఆదిత్, యోగ్‌జాపీ, ఇయాన్‌అన్నాచ్చి, ముత్తురాం ప్రధాన పాత్రలను పోషించిన ఇందులో నటి అను సితార, సుభిక్ష, లీసా ముగ్గురు హీరోయిన్లు నటించారని చెప్పారు. అన్భువేల్‌రాజన్‌ నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్‌ ఆవిష్కర కార్యక్రమాన్ని సోమవారం చెన్నైలో నిర్వహించనున్నారు. చిత్రాన్ని ఈ నెల 7న విడుదల చేయనున్నారు. 

మరిన్ని వార్తలు