అత్తమడుగు వాగులోనా.. అత్త కొడుకో...

15 Dec, 2013 00:24 IST|Sakshi
అత్తమడుగు వాగులోనా.. అత్త కొడుకో...
మహానటుడు ఎన్టీఆర్ సాధించిన ఘనవిజయాలలో ‘కొండవీటి సింహం’ సినిమా ఒకటి. అందులో ఎన్టీఆర్, శ్రీదేవిపై చిత్రీకరించిన ‘అత్తమడుగు వాగులోనా... అత్త కొడుకో...’ పాట అప్పట్లో మాస్‌ని ఉర్రూతలూగించింది. ఇప్పుడా పాటని రీమిక్స్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాలో ఈ పాట పెట్టాలని ఎన్టీఆర్ అనుకుంటున్నారట. ఈ రీమిక్స్‌ని ఎన్టీఆర్, అక్షపై ప్రత్యేక గీతంగా చిత్రీకరించే అవకాశం ఉందనేది యూనిట్ వర్గాల సమాచారం.
 
 ఇలా తాతయ్య ఎన్టీఆర్ పాటలను రీమిక్స్ చేసి ఉపయోగించుకోవడం ఎన్టీఆర్‌కి కొత్త కాదు. ఇంతకు ముందు ‘వేటగాడు’లోని ‘ఆకు చాటు పిందె తడిసె’ పాటను ‘అల్లరి రాముడు’లోనూ, ‘యమగోల’లోని ‘ఓలమ్మీ తిక్కరేగిందా’ పాటను ‘యమదొంగ’లోనూ రీమిక్స్ చేశారు. ‘రభస’గా ప్రచారం జరుగుతున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ నెల మూడోవారం నుంచి హైదరాబాద్‌లో కీలకమైన షెడ్యూలు జరుగనుంది. అతి ముఖ్య సన్నివేశాలను ఈ షెడ్యూలులో చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత జైపూర్‌లో మరో షెడ్యూలు జరగనుంది. ఇందులో సమంత, ప్రణీత నాయికలు.