ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూత

18 Feb, 2015 17:24 IST|Sakshi
ప్రముఖ నిర్మాత రామానాయుడు కన్నుమూత

సీనియర్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు (79) మరణించారు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మరణించారు. అత్యధిక సినిమాలు తీసిన నిర్మాతగా ఆయన గిన్నెస్ బుక్లోకి ఎక్కారు. 15 భాషలలో 155కి పైగా సినిమాలు నిర్మించారు. 2012లో పద్మభూషణ్ అవార్డు, 2009లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనను వరించాయి. మూవీమొఘల్గా పేరుపొందిన ఆయనకు వివిధ రకాలుగా చికిత్సలు అందించినా ఫలితం లేకపోయింది. ఆయనకు ఇద్దరు కుమారులు నిర్మాత సురేష్ బాబు, నటుడు వెంకటేశ్లతో పాటు కుమార్తె లక్ష్మి ఉన్నారు. ఆయన భార్య రాజేశ్వరి.

1936 జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో రామానాయుడు జన్మించారు. 1999-2004 మధ్య బాపట్ల ఎంపీగా లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఎంతో పేరుపొందిన రామానాయుడు మరణించిన విషయం తెలిసి టాలీవుడ్ దిగ్భ్రాంతి చెందింది. ఆయన కేన్సర్ను అధిగమించి క్షేమంగా బయటకు వస్తారని అందరూ ఆశించారు గానీ, అది సాధ్యం కాలేదు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. మూవీ మొఘల్ గా పేరుపొందారు. తిరుగులేని నిర్మాతగా, మంచి మనిషిగా ఆయనకు పేరుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉండేవారు.