సూపర్‌స్టార్‌కు రాజ్‌ఠాక్రే ఏం చెప్పారు?

12 Dec, 2016 10:52 IST|Sakshi
సూపర్‌స్టార్‌కు రాజ్‌ఠాక్రే ఏం చెప్పారు?
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ నటించిన రయీస్ సినిమా విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా అంటే వచ్చే సంవత్సరం జనవరి 26వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, సినిమాలో హీరోయిన్‌గా పాకిస్థానీ నటి మహీరా ఖాన్ నటించడమే సినిమాకు పెద్ద అడ్డంకిగా మారింది. పాకిస్థానీ నటులు నటించిన సినిమాలను విడుదల కానివ్వబోమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధిపతి రాజ్ ఠాక్రే ఇంతకుముందే గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమా ఏమవుతుందోనన్న ఆందోళనలు మొదలయ్యాయి. దాంతో.. సినిమా హీరో షారుక్ ఖాన్ స్వయంగా రాజ్‌ఠాక్రే వద్దకు వెళ్లి సినిమా గురించి, సినిమా ప్రచారం గురించి వివరణ ఇచ్చుకున్నారు. 
 
మాహిరాఖాన్ ఈ సినిమాను భారతదేశంలో ఏమాత్రం ప్రమోట్ చేయబోదని షారుక్ చెప్పారు. గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో జరిగిన సమావేశంలో భవిష్యత్తులో తీయబోయే సినిమాలు వేటిలోనూ పాకిస్థానీ ఆర్టిస్టులు ఉండబోరని హామీ ఇచ్చారని, అలాగే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మాహిరాఖాన్ ప్రచారం చేస్తుందంటూ వచ్చిన కథనాలను కూడా షారుక్ ఖండించారని రాజ్ ఠాక్రే చెప్పారు. అయితే ఇంతకుముందు ఈ సినిమా నిర్మాత రితేష్ సిధ్వానీ మాత్రం మాహిరా ఖాన్‌కు పూర్తి మద్దతుగా నిలిచారు. అవసరమైతే ఆమెతో కూడా భారతదేశంలో సినిమాను ప్రమోట్ చేయిస్తామని ఆయన చెప్పారు. పాకిస్థానీ నటులు భారతదేశంలో ప్రవేశించకుండా ప్రభుత్వం వైపు నుంచి నిషేధం ఏమీ లేదని అన్నారు. కరాచీకి చెందిన మాహిరా ఖాన్ (31) దుబాయ్‌లో షారుక్‌తో కలిసి రెండు పాటల షూటింగ్‌లో పాల్గొంటుందని ఇంతకుముందు వార్తలొచ్చాయి.